ప్రాణాపాయస్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్, దైర్యం చెప్పిన యంగ్ టైగర్

విడయవాడ- అభిమానం.. ఇది ఎప్పుడు, ఎవరిపై ఏర్పడుతుందో తెలియదు. ఐతే సినిమా నటీ నటులకు మాత్రం చాలా మంది అభిమానులుంటారు. తమ అభిమాన తారల కోసం ప్రాణాలైనా ఇచ్చే వీరాభిమానులు సైతం ఉన్నారు. ఇక జీవితంలో ఒక్కసారైనా తన అభిమాన నటీనటులను చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కు ఉంటుంది. కొంత మందికి అది సాధ్యమైతే, మరి కొంత మందికి సాధ్యం కాకపోవచ్చు.

ఈ మధ్య కాలంలో కొంత మంది అభిమానులు, తాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తమ అభిమాన హీరోలను చూడాలని కోరుతున్నారు. వీలును బట్టి ఆయా హీరోలంతా తమ ఫ్యాన్స్ కోసం వెళ్లి, వారికి దైర్యం చెబుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఇదే సందర్బం ఎదురైంది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు ప్రాణాపాయస్థిలో ఉండగా, ఒక్కసారి ఆయన్ను చూడాలని కోరాడు.

NTR 1

తూర్పుగోధావరి జిల్లాకు రాజోలుకు చెందిన కొప్పాడి మురళి జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మురళి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన ప్రస్తుతం విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడు తాను ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌ ను కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు.

వెంటనే స్పందించిన డాక్టర్లు ఈవిషయాన్ని కృష్ణా జిల్లా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు రాయుడు బాబ్జీ, భాస్కర్‌ చౌదరిలకు తెలియజేశారు. వారు ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్‌ వీడియో కాల్‌ చేసి మురళితో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వైద్యులను అడగటంతో పాటు, త్వరలోనే కోలుకుంటావని ఎన్టీఆర్ దైర్యం చెప్పారు. ఇంకేముంది ఎన్టీఆర్ వీడియో కాల్ లో పరామర్శించడంతో మురళి పొంగిపోయాడు. మూడు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానని ఎన్టీఆర్‌కు తెలిపాడు మురళి.