హింసాత్మక ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక సంఘటన స్థలానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తదితరులను నిర్భందించిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఖేరీలోకి ఎవరూ కూడా అడుగుపెట్టకుండా యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ సారథ్యంలోని ఐదుగురు ప్రతినిధుల బృందం లఖింపూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించేదుకు సిద్దమయ్యారు. కాగా, రాహుల్ పర్యటనకు అనుమతించాలంటూ కాంగ్రెస్ ఇంతకు ముందు రాసిన లేఖను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. కానీ రాహూల్ మాత్రం తన పర్యటనలో మార్పు లేదని.. బయలుదేరారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక, మరో ముగ్గురిని లఖింపూర్‌లో పర్యటనకు అనుమతిస్తున్నట్టు హోం శాఖ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో బుధవారం మధ్యాహ్నం లక్నో విమానాశ్రయంలో గొడవ నెలకొంది.
తమ పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టారు. ఇందుకు రాహుల్ నిరాకరిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్, పంజాబ్ సీఎం ఛన్నీ కూడా బైఠాయించారు. ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. లఖింపూర్‌లో గత ఆదివారంనాడు చెలరేగిన హింసాకాండలో చనిపోయిన కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు.