కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణ స్నేహితుడిగా.. ఆయన ఆత్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్సార్ మృతి తర్వాత కేవీపీ.. రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఆయన మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్సార్ చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకున్నారు కేవీపీ రామచంద్రరావు. విజయవాడలో జరిగిన జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ చివరిగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 41 ఎంపీ సీట్లు సాధించుకుని.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని సందేశమిచ్చారన్నారు. రాజశేఖర్‌రెడ్డి కలను సాకారం చేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు కేవీపీ.
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కేవీపీ. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి.. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పుడు.. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు స్పందించకపోవడం దారుణమన్నారు. పార్లమెంటులో రెండు పార్టీలకు కలిపి 36 మంది ఎంపీల బలం ఉన్నా కనీసం ప్రశ్నించలేదని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలను ప్రశ్నించకపోవడం దారుణమన్నారు కేవీపీ. ఇదంతా చూసి తెలుగువాడిగా సిగ్గుపడుతున్నానని.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గూటి పక్షులని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా మండి పడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సమయంలో ఒక్క ఎంపీ కూడా ఖండించలేదన్నారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు కేవీపీ. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.