కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే కూడా ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు జరిగిన ఎలక్షన్స్‌లో 135కి పైగా సీట్లలో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా సంతోషంలో తేలిపోతోంది. అయితే ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. దీని వెనుక కర్నాటక కాంగ్రెస్ నేతల కృషి ఎంతగానో ఉంది. రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ఫ్రంట్‌లో ఉంచుతూ కాంగ్రెస్ ఎన్నికల పోరాటం సాగింది. వాళ్లు తమ శాయశక్తులా పార్టీ కోసం అహర్నిషలు శ్రమించారు. దీంతో ప్రజలు ఆ పార్టీ వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించడం వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నారు.
ఆ వ్యక్తి మరెవరో కాదు రాహుల్ గాంధీ. కర్నాటక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారు. గతేడాది ఆయన నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రంలోని 51 నియోజకవర్గాల గుండా సాగింది. ఆ 21 నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. చామరాజనగర్‌లో 3 నియోజకవర్గాల్లో, మైసూర్‌లోని 11 నియోజకవర్గాల్లో 8 చోట్ల, మాండ్యలోని 7 నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే చిత్రదుర్గలో 5 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. బళ్లారిలో 5 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. రాయచూర్‌లో మొత్తం ఏడు స్థానాలు ఉండగా.. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం లేదా ఆధిక్యంలో ఉంది.
కర్నాటకలో కాంగ్రెస్ శ్రేణులను ముందుండి నడిపించారు డీకే శివకుమార్, సిద్ధరామయ్య. ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. అదే విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అంతేగాక కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆకర్షణ తగ్గకుండా చూసుకున్నారు. జోడో యాత్ర కర్నాటకలో కాంగ్రెస్ పుంజుకునేందుకు ఒక ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే, రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగింది. 145 రోజుల పాటు సాగిన ఈ యాత్ర సెప్టెంబర్ 30, 2022న ఎలక్షన్ బరిలో దిగిన కర్నాటకలో ప్రవేశించింది. అక్టోబర్ 23 వరకు రాహుల్‌తో పాటు ఇతర పార్టీ నేతలు యాత్రలో పాల్గొని ఏడు జిల్లాలను కవర్ చేశారు. చామరాజనగర్, మైసూర్, మాండ్య, తుంకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ ఈ జాబితాలో ఉన్నాయి.