గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు అమాయకులను టార్గెట్ చేసుకుంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారు.
1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ స్థానిక ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. తర్వాత మరో వర్తకుడు వీరేందర్‌ను ముష్కరులు కాల్చి చంపారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని కాల్చి చంపారు. చనిపోయిన వారిని ప్రిన్సిపాల్ సూపీందర్ కౌర్ (44), దీపక్ చాంద్ లుగా గుర్తించారు. ఈ ఘటన శ్రీనగర్ లోని ఈద్గా ప్రభుత్వ బాలుర పాఠశాలలో జరిగింది. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని శౌరాలోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 23 మందిని ఉగ్రవాదులు చంపేశారు. శ్రీనగర్ లో 10 మందిని, పుల్వామాలో నలుగురిని, అనంత్ నాగ్ లో నలుగురిని, కుల్గాంలో ముగ్గురిని, బారాముల్లాలో ఇద్దరిని, బుద్గాం, బందీపురాలో ఒక్కొక్కరిని ఉగ్రవాదులు చంపారు. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.