ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారు ప్రజల్లో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. వీరిని కనిపెట్టడం ప్రజలకు చాలా కష్టమైన పని అయితే.. ఇంటెలిజెన్స్ నిఘాలో మాత్రం వీరు తప్పించుకోలేరు.
ఉగ్రవాదం.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ఆర్థికంగా ఎదిగిన అగ్ర దేశాల నుండి ఆకలి కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న చిన్న దేశాలకి కూడా ఇప్పుడు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఇదే. ఇందుకు మన ఇండియా కూడా అతీతం ఏమి కాదు. మన దేశం ఇప్పటికే ఎన్నో ఉగ్ర దాడులను తట్టుకుని నిలబడింది. ఇంకా ఆ సమస్యపై పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరంలో ఉగ్ర వాదులు పట్టుబడటం అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులు వికారాబాద్ అటవీ ప్రాంతంలో కొన్ని సమావేశాలు నిర్వహించనట్లు తెలుస్తోంది.
గతంలో సిమీ ఉగ్రవాద సంస్థకు చెందిన వికారుద్దీన్ ముఠా వికారాబాద్ అడవుల్లో శిక్షణ తీసుకున్నారు. ఇలా నగరాన్ని అడ్డాగా చేసుకుని ఉగ్రవాదులు తమ కార్యాకలాపాలను సాగిస్తున్నారు. అయితే, జాతీయ నిఘా సంస్థల ఉత్తమ పని తీరుతో ఉగ్రవాదులు ఎప్పుటికప్పుడు పట్టుబడుతున్నారు. నగరానికి పెద్ద ముప్పులు తప్పుతున్నాయి. ఇప్పుడు కూడా జాతీయ నిఘా సంస్థల చాకచక్యంతోనే పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నేపధ్యంలో అసలు జాతీయ నిఘా సంస్థలు అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి బాధ్యత ఏమిటి? సామాన్యులుగా ప్రజల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా కనిపెడుతాయి? ఇలాంటి అన్నీ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాతీయ నిఘా సంస్థలు అనేవి ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవి దేశ భద్రతకు సంబంధించిన బాధ్యతలను చూసుకుంటాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే విషయాలపై సమాచారాన్ని సేకరించి ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఉంటాయి. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ అండ్ అనాలిసిస్ వింగ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్, నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ ఇన్‌వెస్టిగేషన్ వంటి నిఘా సంస్థలు ఉన్నాయి. వీటిలో కూటిలో కూడా కొన్ని మాత్రమే ఎక్కువగా దేశ భద్రత గురించిన విషయాలపై దృష్టి సారిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ అండ్ అనాలిసిస్ వింగ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్, నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌లు ప్రధానమైనవి.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది చట్టాల అమలు, జాతీయ భద్రత, సైనిక, ప్రజా భద్రత, విదేశాంగ విధాన లక్ష్యాలకు మద్దతుగా సమాచారాలను సేకరించి విశ్లేషిస్తుంది. ఇక్కడ సమాచారాన్ని సేకరించడంలో గోప్యత అతి ముఖ్యమైంది. ఒక్కోసారి ఈ సమాచారం కోసం ఉన్నత అధికారులు కూడా గూఢచర్యం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇంటెలిజెన్స్ ఒక్కోసారి సామాన్యులు లాగా, ఒక్కోసారి ఇతర సంస్థల ప్రతినిధులుగా తమ ఐడెంటిటీని మార్చుకుని జీవిస్తూ ఉంటారు. ఇలా ఫీల్డ్ లోకి నేరుగా సమాచారం సేకరించే వారు కొందరైతే.. మరి కొన్ని వింగ్స్ టెక్నాలజీని వాడుకుని ఉగ్రమూకపై ఎప్పుడూ డేగ కన్ను వేసే ఉంటాయి. దాడులకు సంబంధించిన పదాలు ఎక్కడైనా చాట్ జరిగినా, మెయిల్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నా, ఏ ఐడీ నుండి అయినా ఉగ్రవాద ప్రేరేపిత వీడియోలు ఎక్కువగా స్ట్రీమ్ అవుతున్నా వాటన్నిటిని ఎప్పటికపుడు మోనిటరింగ్ చేసే వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వద్ద అనుమానితుల జాబితా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వీరందరిపై ఎప్పుడు పర్యవేక్షణ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించే ఇన్ ఫార్మెర్స్ చాలా మందే ఉంటారు. గత ఏడాది దసరా సమయంలో కూడా ఇలాంటి నిఘా వల్లనే హైదరాబాద్ లో కొంతమంది ఉగ్రవాదులను పట్టుకోగలిగారు. నిజానికి ఉగ్రవాదంలోకి లాగబడ్డ యువతకి ఇలాంటి అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తారు. కాబట్టి.. ఉగ్రమూకకి కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాడే అన్నీ ప్యాట్రెన్స్ ఐడియా ఉంటాయి. కానీ.., ఎక్కడో ఓ దగ్గర చిన్న తప్పు చేసి పెట్టుబడి పోతుంటారు.
ఇక మనం కూడా కొంతమేర అవహగాన పెంచుకుంటే.. మన చుట్టూ ఎలాంటి ఉగ్ర కదలికలు ఉన్నా పోలీసులకు సమాచారం అందించవచ్చు. షెడ్ లలో అసాధారణమైన పరికరాలను ఎవరైనా నిల్వ చేసినా, కారణం లేకుండా భారీ ఎత్తున ఎవరైనా రసాయనాలను కలిగి ఉన్నా, ఎక్కడైనా అనుమానాస్పద నగదు లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతున్నా, ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో ఐడెంటిటీ కలిగి ఉన్నా, మీ ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఏవైనా సమావేశాలు జరుగుతున్నా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను సోషల్ మీడియాలో ఎవరైనా అదే పనిగా షేర్ చేస్తున్నా, బాంబు తయారీ సూచనలు ఎవరైనా చేస్తున్నా, వాటి గురించి వారు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులకు వెంటనే సమాచారం అందించడం మంచింది.
ఇలా ఇంటెలిజెన్స్ వర్గాలు స్వయంగా సాధించే సమాచారంతో పాటు, టెక్నాలజీ ఆధారంగా దొరికే సమాచారం, ఇన్ ఫార్మెర్స్ అందించే సమాచారం, సామాన్య ప్రజలు అందించే సమాచారం, అనుమానితులపై ఉంచే నిఘా.. ఇవన్నీ కూడా ఉగ్ర కదలికలు గుర్తు పట్టడానికి ఉపయోగపడుతాయి. సామాన్యులుగా ప్రజల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలానే పట్టుకుంటూ ఉంటాయి. ఇలా దేశం కోసం, మన కోసం జాతీయ నిఘా సంస్థలు అనుక్షణం కష్టపడుతూ ఉంటాయి కాబట్టే.. అందరం ధైర్యంగా జీవించగలుగుతున్నాము. చూశారు కదా. జాతీయ నిఘా సంస్థలు దేశ రక్షణ కోసం ఎంతలా కష్టపడుతున్నాయో? మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.