నగరంలో ఉగ్ర కదలికలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్ కావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్ కావటం ప్రజల్ని భయాందోళలనలకు గురి చేస్తోంది. ఉగ్ర కుట్ర కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాలతో కూడా లింకులు ఉండటం.. భూపాల్‌లో 11 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. భూపాల్‌లో పట్టు బడ్డవారికి హైదరాబాద్లో పట్టుబడ్డవారికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ ఉగ్ర కుట్రపై పూర్తి సమాచారం..
ఉగ్రవాద శిక్షణలో భాగంగా మొత్తం 17 మంది భోపాల్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిలో ఆరుగురు హైదరాబాద్‌లోనే ఉంటూ వికారాబాద్ అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అక్కడే సమావేశాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టింది. మంగళవారం భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
భోపాల్‌లో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇక, శిక్షణ కోసం వచ్చిన ఈ ఉగ్రవాద సానుభూతిపరులంతా పగడ్భందీగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా సంబంధాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. డార్క్ వెబ్‌ను ఉపయోగించి సంప్రదింపులు చేసుకుంటున్నారు. ఉగ్రవాద సానుభూతి పరులంతా పెద్ద నగరాలను టార్గెట్ చేసుకుని అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్లో పట్టుబడ్డ వారు జనంలో జనంలా కలిసిపోయి జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడి ఉండటం విశేషం. నగరంలో పట్టుబడ్డ సలీమ్ ఓ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్ రెహ్మాన్ అంతర్జాతీయ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ వైద్య సేవలు అందిస్తున్నాడు. మహమ్మద్ అబ్బాస్, హమీద్, సల్మాన్‌లు రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉండగా అతడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్లో పట్టుబడ్డ ఆరుగురు హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు చెందిన వారిగా తేలింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సంవత్సరం క్రితం భారత్‌లో వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నెలలో తమిళనాడులో జియవుద్దీన్ బఖావి అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు చెందిన వాడిగా తేలింది. ఇక, హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు దాదాపు 60 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సంస్థ 1952లో జెరూసలెంలో పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు సభ్యులున్నారు. ఇండియాలో కూడా సానుభూతి పరులు ఉన్నారు. మరి, దేశంలో వేగంగా విస్తరిస్తున్న హిజ్బుత్ తహ్రీర్ సంస్థ కార్యకలాపాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.