గత కొంత కాలంగా ముంబాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు చిన్నపాటి చెరువులు.. కాలువల్లా తయారయ్యాయి. వర్షాల ఇక ప్రజల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భారీ వర్షాలకు మనుషులే విల విలలాడుతుంటే.. ఇక జంతువుల పరిస్థితి ఏంటో ఊహించుకోవొచ్చు. వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా రెయిన్ కోట్, గొడుగు సహాయంతో బయటకు వెళ్తుంటారు.. ఒకవేళ అవి లేని పరిస్థితిలో ఎక్కడో అక్కడ నిల్చుకొని వర్షం నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు.
అయితే జంతువుల సంగతి ఏంటి.. వాటికి ఇండ్లు ఉండవు. నిలువ నీడ ఉండదు. వర్షం వచ్చినా.. చలి పెట్టిన.. ఎండ కొట్టినా.. అలా రోడ్ల మీద బతకాల్సిందే. అలాంటి దయనీయ పరిస్థితుల్లో వీధికుక్కలకు షెల్టర్లకు తరలించడం, వాటిని సంరక్షించడం చేస్తుంటారు కొందరు. ఇదిలా ఉంటే ముంబయి తాజ్ హోటల్ ఉద్యోగి చేసిన మంచి పనియి ఒక్కసారే స్టార్ అయ్యాడు. ఇంతకీ ఆ ఉద్యోగి చేసిన మంచి పని ఏంటా అనుకుంటున్నారా? వర్షంలో ఓ కుక్క తడుస్తుంటే.. తన గొడుగు అందించి తడవకుండా చూశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఓ ఔత్సాహికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర చాలా పెట్స్ ఉంటాయి. అయితే.. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో రతన్ టాటా దృష్టికి వచ్చింది.
ఇంకేముంది రతన్ టాటా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఆనందాన్ని స్వయంగా పంచుకున్నారు. ‘ఈ వర్షాకాలంలో వీధి జంతువులకు ఉపశమనం’ అనే శీర్షికను జోడించి.. ఈ తాజ్ ఉద్యోగి చాలా దయ గలవాడు. భారీ వర్షాల సమయంలో ఓ కుక్కను తడిసిపోకుండా కాపాడటానికి తన గొడుగుతో ఒక వీధి కుక్కను కాపాడాడు. ముంబై లాంటి బిజీ నగరంలో అతను చేసిన పని ఎంతో సంతోషాన్ని అందించింది అంటూ పేర్కొన్నారు. రతన్ టాటా పంచుకున్న ఈ పోస్ట్‌ను 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే మీరే సార్.. అందుకే మీరంటే అందరికీ ఇష్టం సార్.. అంటూ రతన్ టాటాపై.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.