ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత క్రమంగా అది పడిపోయిందనుకోండి. కానీ దాని మీద ఉన్న క్రేజ్ ఇప్పటికీ పోలేదు. అయితే టాటా కంపెనీ ఇప్పుడు భారత్ లో ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఉన్న చైనా దేశానికి చెందిన ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక టాటా నిర్ణయం సామాన్యులకి వరంగా మారుతుందా? ఐఫోన్ ధరలు తగ్గుతాయా? సామాన్యుడు సైతం కొనేలా ధరలు ఉంటాయా?
భారత దిగ్గజ కంపెనీల్లో టాటా గ్రూప్ సంస్థ ఒకటి. విలువలతో కూడిన వ్యాపారం, విశ్వసనీయత కలిగిన సంస్థ టాటా గ్రూప్. వ్యాపారవేత్తగా కాకుండా నికార్సైన పారిశ్రామికవేత్తగా రతన్ టాటా జీవిస్తారు. వ్యాపారవేత్త లాభాలు తీసుకుంటాడు, పారిశ్రామికవేత్త పరిశ్రమలను పెంచుకుంటూ.. పది మందికి ఉపాధి పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. రతన్ టాటా కూడా పారిశ్రామికవేత్తనే. సంస్థ లాభాల్లో సగానికి పైగా వాటాను సమాజం కోసం వెచ్చిస్తారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్ సీ సర్వీసెస్, టాటా ఎయిర్ లైన్స్ ఇలా ఒకటా, రెండా ఎన్నో వ్యాపారాల్లో అడుగుపెట్టి గుడిలో ధ్వజస్తంభంలా టాటా గ్రూప్ ని నిలబెట్టారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కొని లాభాలో బాటలో పరుగులు పెట్టించడం రతన్ టాటాకు వెన్నతో పెట్టిన విద్య.
అయితే ఈయనకు ఒక బలహీనత ఉంది. మంచితనం. పేదలు, మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించడం. ఒక బైక్ మీద నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లలేకపోతున్నారని బాధపడ్డ రతన్ టాటా.. బడ్జెట్ లో ఒక నానో కారుని రూపొందించారు. నష్టాలు వచ్చాయి కానీ మిడిల్ క్లాస్ వాడి కోసం భరించారు. కారు కొనాలంటే గగనం అనుకునే రోజులవి. అలాంటిది ఆ గగనాన్నే కిందకి తీసుకొచ్చారు. ఆకాశ గంగను నేలకు తీసుకొచ్చిన భగీరథుడులా ఈ రతన్ టాటా కూడా సామాన్యులు కొనలేని అత్యధిక ధరలు కలిగిన వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇదంతా ఎందుకు అంటే.. టాటా ఇప్పుడు ఐఫోన్ తయారీలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో ఐఫోన్ తయారీ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాపిల్ ఐఫోన్ల తయారీని భారత్ లో చేపట్టేందుకు టాటా గ్రూప్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని తైవాన్ కు చెందిన విస్ట్రాన్ కంపెనీ.. ఐఫోన్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కంపెనీ ప్రయత్నాలు చేస్తుందని.. ఈ నెలలోనే కొనుగోలు ప్రక్రియ ఉంటుందని అంతర్జాతీయ వెబ్ సైట్ వెల్లడించింది. అయితే ఈ ప్లాంట్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే గనుక యాపిల్ ఫోన్ల తయారీకి సంబంధించి భారత్ లో తొలి ఐ ఫోన్ ప్లాంట్ ఇదే అవుతుంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడల్ తోనే టాటా గ్రూప్ ఈ ప్లాంట్ లో ఉత్పత్తిని మొదలుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ ప్లాంట్ లో చైనాకు చెందిన విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్ 12, ఐఫోన్ 14 మోడళ్లను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్ టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్తే మన భారత మార్కెట్ నుంచి చైనా కంపెనీ వెళ్ళిపోతుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనాతో సఖ్యత లేదు. గత ఏడాది చైనాలో లాక్ డౌన్ కారణంగా యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ చాలా రోజులు మూతపడింది. దీంతో ఐఫోన్ కంపెనీకి ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో అలర్ట్ అయిన యాపిల్ కంపెనీ తన మార్కెట్ ను ఇతర దేశాలకు విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా తన ఉత్పత్తిలో 25 శాతం వరకూ భారత్ కు బదిలీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత్ లో ఉన్న ప్లాంట్ ను టాటా గ్రూప్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
భారత్ లో ఉన్న చైనాకు చెందిన విస్ట్రాన్ నుంచి టాటా గ్రూప్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇప్పటి వరకూ చైనా తీసుకున్న అధిక శాతం లాభాలు ఇకపై చైనాకు వెళ్లవు. దీని వల్ల ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. రతన్ టాటా సామాన్యుల గురించి ఆలోచించే మనిషి. ఐఫోన్ కొనాలని కలలు కనే వారి కోసం ధరలు తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే జీవితంలో కారు ఎక్కలేని వారిని కారు ఎక్కించిన మనిషి.. ఐఫోన్ ని సామాన్యులకు అందుబాటులో తీసుకురాకుండా ఉంటారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ విషయంలో టాటా గ్రూప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
మరోవైపు తైవాన్ దేశానికి చెందిన ఫాక్స్ కాం, పెగాట్రాన్ కంపెనీలు కూడా భారత్ లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నాయి. అయితే ఈ పెగాట్రాన్ యూనిట్లను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ నిజమైతే గనుక భారత్ లో విదేశీ కంపెనీల హవా ఉండదు. విదేశీ కంపెనీలు ఇక్కడ మార్కెట్ చేసుకోవడం కంటే మన వాళ్ళు చేస్తేనే దేశానికి ఎక్కువ లాభం ఉంటుందనేది టాటా ఆలోచన అయి ఉండవచ్చు. అందుకే ఐఫోన్ తయారీ యూనిట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఐఫోన్ తయారీలో టాటా కంపెనీ అడుగుపెడితే ఎలా ఉంటుంది? ధరలు తగ్గే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.