పువ్వుపుట్టగానే పరిమళిస్తుందని అంటారు .కొందరు పిల్లలు ఒక్కో విషయంలో అద్భుతమైన ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శిస్తుంటారు .కొందరు సంగీతంలోను కొందరు సాహిత్యంలోను కొందరు శాస్త్ర సంబంధమైన అంశాలలో విశేషమైన ప్రతిభని కనబరుస్తుంటారు.తల్లితండ్రుల ప్రభావం కొంతవరకు ఉన్నా ఒక్కొక్కరు స్వయం ప్రతిభతో రాణిస్తూ ఉంటారు.చిన్నతనంలో పిల్లలకి చెప్పిన చందమామ కథలు కావచ్చు మరో కథలు కావచ్చు.
ఇలాంటివి చిన్నతనంలో వినటం వలన వారిలో ఉత్సాహం ఆసక్తి కలిగే అవకాశం ఉంది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల గురించి పెద్దవాళ్లు కథలుగా చెబుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా వింటుంటారు. కానీ, పట్టుమని పదేళ్లు కూడా లేని నికోల్ పెద్ద పెద్ద వాళ్లకే అంతుపట్టని ఖగోళ రహస్యాలను విడమరచి చెబుతుంటే పెద్దలు ఆసక్తిగా వింటున్నారు.
అత్యంత పిన్నవయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్తగా 8 ఏళ్ల నికోల్ ఒలివేరాను నాసా ఇటీవల గుర్తించింది. నికోల్ ఏడు గ్రహశకలాలను కనుక్కున్నందుకుగాను సర్టిఫికెట్ ఇచ్చి మరీ తన గౌరవాన్ని చాటుకుంది. ఖగోళశాస్త్రంపై అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసాలిస్తున్న ఈ చిన్నారి బ్రెజిల్ వాసి. నికోల్ కిందటేడాది ఆస్టరాయిడ్ హంట్ సిటిజన్ సైన్స్ ప్రోగ్రామ్లో పాల్గొంది.
ఈ కార్యక్రమాన్ని నాసా అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారంతో నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న నికోల్ 7 గ్రహ శకలాలను కనుక్కొంది. అందుకుగాను నాసా నుంచి సర్టిఫికెట్ అందుకుంది. ఆకాశంలో తళుక్కుమంటున్న నక్షత్రం కావాలని, తెచ్చివ్వమని తల్లిని అడిగింది నికోల్. కూతురిని సంతోషపెట్టడానికి నికోల్ తల్లి ఆమెకు నక్షత్రాల బొమ్మ ఒకటి తెచ్చి ఇచ్చింది.
ఆ రోజు నుంచి నికోల్కు నక్షత్ర లోకం గురించి తెలుసుకోవడంలో ఆసక్తి మొదలైంది. ఇప్పుడు నికోల్ ఎన్నో స్కూళ్లు, ఇతర ఖగోళ ఉపన్యాసాలలో తన గళం వినిపించే స్థాయికి ఎదిగింది. ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యాసం ఇవ్వడానికి బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ నికోల్ను ఆహ్వానించింది. కరోనా కారణంగా నికోల్ ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నింటికీ ఆన్లైన్లో హాజరవుతోంది.
మీ పిల్లలకు ఏ రంగం లో ఆసక్తి చూపుతున్నారో మీరు ముందుగా గ్రహిస్తే వారికి ఆ రంగానికి సంబంధించిన వివరాలు వారికి అందిస్తూ మరికొంత ఆసక్తిని కలిగిస్తే ఇలాంటి ప్రతిభ గల బాలలుగా మారే అవకాశం ఉంటుంది.మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియ చేయండి .