అంతు పట్టని రోగాలు.. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొన్ని సార్లు అవి ప్రాణాంతకం కాకపోయినా.. కలవరపెడుతుంటాయి. వీటిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అటువంటి ఘటనే ఇటీవల జరిగింది.
మానవ శరీరం.. వివిధ రకాలైన వ్యవస్థలు, అవయవాలు, కణజాలాలు, కణాల సమాహారం. రక్తం, నీరుతో నిండి ఉంటుంది. శాస్త్ర, వైద్య పరంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా..వాటిని సవాలు విసిరేలా కొత్త కొత్త రోగాలు మానవ శరీరంలో నుండి పుట్టుకు వస్తున్నాయి. అంతు పట్టని రోగాలు.. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొన్ని సార్లు అవి ప్రాణాంతకం కాకపోయినా.. కలవరపెడుతుంటాయి. వీటిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అటువంటి ఘటనే ఇటీవల జరిగింది. తన వద్దకు అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగికి, ఎక్సరే తీయించాడు వైద్యుడు. తీరా ఆ ఎక్స్‌రేను చూసి షాక్ తిన్నాడు. వెంటనే ఫోటో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేస్తే వైరల్ గా మారింది.
తీవ్రమైన దగ్గుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి ఎక్స్ రే తీయించగా.. లోపలంతా టేప్ వార్మ్ (నులి పురుగులు) గుడ్లు పెట్టేశాయి. అతడి శరీరం ఆ గుడ్లతో నిండిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు సదరు వైద్యుడు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత నెలలో సోపాల్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గుతో బొటుకాటు నగరంలోని ఓ ఆసుపత్రికి వచ్చాడు. అయితే అతడిని పరీక్షించిన బోరిన్ డిసౌజా అనే డాక్టర్‌కు వ్యాధి ఏంటో అంతుపట్టడం లేదు. అతడిపై పలు టెస్టులు నిర్వహించారు. అందులో ఎక్స్‌రేను చూడగా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ ఎక్స్‌రేలో ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నట్లు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో సిస్టిసెర్కోసిస్(Cysticercosis)అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ పేగు పరాన్నజీవి కారణంగా సోకుతుందన్నారు.
నులి పురుగులు గుడ్లు కారణంగా రోగికి ఎలాంటి ప్రమాదం ఉండదని, అయితే రోగికి ఎలాంటి అసౌకర్యం కలిగించనంత వరకు.. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టర్ డిసౌజా వివరించారు. ఇలాంటి కేసులు బ్రెజిల్‌లో అరుదుగా నమోదవుతాయన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది నులిపురుగులు.. శరీరంలో గుడ్లు పెట్టడం ద్వారా కలిగే వ్యాధి అని, ఇవి మనిషి శరీరంలోకి పందులు, బోవిన్(ఎద్దు జాతికి చెందినది) లాంటి టేప్ వార్మ్ ఇంటర్మీడియట్ హోస్టుల ద్వారా చేరుతాయని అన్నారు. పరిశుభ్రత నియమాలు తరచుగా విస్మరించే దేశాల్లో ఈ సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని డాక్టర్ చెప్పారు. సిస్టిసెర్సీ మనిషి శరీరంలోని ఏ అవయవానికైనా సోకుతుందని.. దీని ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ న్యూరో సిస్టిసెర్కోసిస్ వల్ల సంవత్సరానికి 50,000 మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ డిసౌజా తెలిపారు.