తల్లి బతికి వస్తుందని.. శవం వద్ద కుమార్తెల పూజలు!

ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. కొంత మంది మూఢ నమ్మకాల మాయలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగ బాబాలు.. స్వామీజీలు గల్లి గల్లీలో పుట్టుకు వస్తున్నారు. మనిషి బలహినతను క్యాష్ చేసుకుంటూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా చనిపోయిన తల్లి తిరిగి బతుకుతుందన్న నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద రెండు రోజులుగా కుమార్తెలు పూజలు చేస్తున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో వెలుగుచూసింది.

gadgag minపోలీసుల కథనం ప్రకారం.. మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) భర్త 20 ఏళ్ల క్రితమే మరణించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.. జయంతి (43), జెసిందా (40).. వారికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి వీరు ఉంటున్న ఇంటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. వాసన రావడం చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయిందని, ఆమె బతుకుతుందన్న ఉద్దేశంతో మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

మొదట తమ ఇంట్లోకి రావొద్దని మేరీ కుమార్తెలు అడ్డుకున్నారు. మేరీ మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. ప్రార్థనలు చేస్తే తమ తల్లి బతుకుతుందని చెప్పారు. చివరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ కూడా వైద్యులతో వారు గొడవకు దిగారు. గత కొంత కాలంగా వీరిద్దరూ మానసికంగా డిప్రెషన్ లో ఉన్నట్లు చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.