సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ

గత కొంత కాలంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రతి పక్ష నేతలు ఇది ముమ్మాటికి రైతు విజయం అని కొనియాడుతున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి… రాజ్యంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి… క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా అన్నారు.

తాజాగా మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా ఆలస్యమైనప్పటికీ స్వాగతించే విషయం అని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే కొంత మంది అన్నదాత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. నిరసన సమయంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి రాష్ట్రానికి మరియు రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని కూడా ఆయన కోరారు.

ఇదిలా ఉంటే.. మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంపై భారతీయ కిసాన్ యూనియన్(బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ప్రతిస్పందించారు. 750 మంది రైతులు చనిపోయాక ఇప్పుడు మేల్కొందని.. 3 వ్యవసాయ చట్టాలను ఎక్కడ ఉపసంహరించుకుంది? పేపర్లు ఎక్కడ ఉన్నాయి? పేపర్లు చూపించండి అంటూ కోరారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని పార్లమెంటులో ఆమోదించాకే ఆందోళన చేస్తున్న రైతులు తమ ఇళ్లకు తిరిగి వెళతారని ఆయన పునరుద్ఘాటించారు.