పెరుగుట తరుగుట కొరకే అన్న మాట దేశంలో ఇప్పుడు నిజం అవుతుంది. నిన్న మొన్నటి వరకు సామాన్యుడిపై భారంగా నిలిచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మధ్య కాలంలో కాస్త ఉపశమనం కలిగించాయి. ఇప్పుడు.. దేశ ప్రధాని మోదీ ప్రజలకు మరో శుభవార్త అందించబోతున్నారు. వంట గ్యాస్ ధరలను సైతం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.312 రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం.
ప్రస్తుతం వంట గ్యాస్ కొనాల్సి వస్తే సామాన్యులు బిత్తరపోతున్నారు. సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగా చేరుకోవడమే ఇందుకు కారణం. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అయితే ఎప్పుడో డబుల్ అయ్యి.., రూ.2వేల మార్కును దాటేసింది. ఇప్పుడు ప్రకటించబోతున్న రాయితీ అమల్లోకి వస్తే.. ఏడు వందల రూపాయలకు వంట గ్యాస్ అందుబాటులోకి రానుంది.
ఇప్పుడురాయితీ కేవలం రూ.40 మాత్రమే ఉంది. ఇంత రేటు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనలేక ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ ప్రభావమే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం అయ్యింది. దీంతో.. కమలనాధులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఇంతే కాకుండా.., రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ధరలు తగ్గిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరి.. వంట గ్యాస్ ధర ఒక్కసారిగా రూ.312 తగ్గడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.