కూతురి వివాహం! పేదలకు రూ.5 వేల చొప్పున దానం చేసిన తండ్రి!

కరోనా కారణంగా దేశం అల్లాడిపోతోంది. ప్రజలు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా చైన్ ని బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గం. కానీ.., ఈ క్లిష్ట సమయంలో కూలీలు, నిరు పేదల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారయ్యాయి. చేసుకోవడానికి పని లేక, చేతిలో డబ్బులు లేక వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనసున్న మహారాజులు ఎందరో దయా హృదయంతో పేదలకి తమ వంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. మైసూర్లోని తిలక్ నగరకు చెందిన హరీశ్ అనే వ్యక్తి కూడా ఇలానే 40 పేద కుటుంబాలకి తల రూ.5 వేల చొప్పున దానం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కానీ.., ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇంతలా దానం చేసిన ఈ పెద్దాయన అపార కుబేరుడు ఏమి కాదు, కోట్లకి అధిపతి కాదు. కేవలం ఓ సాధారణ మధ్య తరగతి తండ్రి. అది కూడా తన కూతురి పెళ్లి సమయంలో ఈయన ఇంత గొప్ప పని చేయగలిగాడు. మరి ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. లాక్డౌన్ కారణంగా వివాహా కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్తి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. అయితే.., తాజాగా తన కూతురి పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించి, ఆ పెళ్లికయ్యే ఖర్చు మొత్తాన్ని పేద కుటుంబాలకు పంచిపెట్టారో మహానుభావుడు. మైసూర్లోని తిలక్ నగరకు చెందిన హరీశ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం మే 12,13వ తేదీల్లో పెట్టుకున్నారు. కానీ, రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇంట్లోనే తన కుమార్తె పెళ్లిని నిరాడంబరంగా చేశారు. ఇక పెళ్లికని దాచుకున్న రూ.2లక్షల సొమ్మును 40పేద కుటుంబాలకు రూ.5వేల చొప్పున పంచి పెట్టారు. ప్రస్తుతం ఈ పెద్దాయన చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా మిగిలిన డబ్బుని.., కరోనా వల్లే ఇబ్బంది పడుతున్న వాళ్లకి పంచి పెట్టడం నిజంగా గొప్ప విషయం కాక మరేంటి?