'బలగం' స్టోరీని టర్న్ చేసింది ఓ కాకి. ఇప్పుడు 'విరూపాక్ష'లో అలాంటి ఓ కాకి.. భయపెట్టి థ్రిల్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో కాకి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి ఈ కాకిగోల?
మీరు ‘బలగం’ మూవీ చూశారా? అని అడిగితే అదేం పిచ్చి ప్రశ్న, ఎప్పుడో చూసేశాం అని చెప్పొచ్చు. సరే ఆల్రెడీ చూసేశారనుకుందాం. అందులో మెయిన్ హీరో ఎవరంటే? తడుముకోకుండా ప్రియదర్శి పేరు చెప్పేస్తారు. కానీ అతడు కాదు. ఎందుకంటే తెలంగాణలోని ‘పిట్టముట్టుడు’ సంప్రదాయం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో కాకి, పిండం ముట్టడం కోసం అందరూ చేసే ప్రయత్నాలు చూస్తే.. ‘బలగం’లో అసలు హీరో కాకి అనిపిస్తుంది. ఇందులోనే కాదు తాజాగా రిలీజైన ‘విరూపాక్ష’లోనూ కాకి తన డామినేషన్ చూపించింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. తెలుగు సినిమా అంటే హీరోహీరోయిన్ కంపల్సరీ. వారితో పాటు ఏమైనా జంతువులు ఉండాలి అంటే చాలావరకు సింహం, పులి లాంటి వాటిని సింబాలిక్ చూపించేవారు. బోయపాటి అయితే ఎద్దుల్ని ఎక్కువగా తన సినిమాల్లో చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా కాకి వచ్చి చేరింది. సాధారణంగా కాకిని బ్యాడ్ లక్ గా చూస్తుంటారు. ఇప్పుడు అదే కాకి.. తెలుగు సినిమాలకు కాసుల కురిపిస్తోంది. చెప్పాలంటే కోట్లకు కోట్లు తెచ్చిపెడుతోంది. ‘బలగం’, ‘దసరా’లో డామినేషన్ చూపించిన కాకి.. ఇప్పుడు ‘విరూపాక్ష’లోనూ కీలక పాత్ర పోషించింది.
మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసిన ‘విరూపాక్ష’ చేతబడి, తాంత్రిక విద్య లాంటి మూఢ నమ్మకాల ఆధారంగా తీశారు. అలా అని సైంటిఫిక్ గా దీనికి లింక్ చేసే ప్రయత్నం చేశారు. ఫుల్ ఆన్ హారర్ ఎలిమెంట్స్ తో తీశారు. ఈ క్రమంలోనే తాంత్రిక విద్యలు కాబట్టి కాకిని చాలా ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. ఎంట్రీలోనే హీరోకి కాకి షాకిస్తుంది. ఆ తర్వాత స్టోరీలో మనుషులు చనిపోవడానికి, ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ‘విరూపాక్ష’లో చాలా చోట్ల హీరోహీరోయిన్ తర్వాత కాకి.. ఎక్కువగా కనిపించింది! సో అంత ఇంపార్టెంట్ రోల్ పోషించింది. మళ్లీ ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుంది కాబట్టి.. దగ్గర్లోని థియేటర్ కి వెళ్లి ఈ మూవీ చూడండి. అసలు విషయం మీకే అర్థమైపోతుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కాకి సెంటిమెంట్ పెరుగుతుండటంపై మీరేం అనుకుంటున్నారు. ఈ అబ్జర్వేషన్ మీకెలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.