రేవంత్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా, కానీ మధ్యలోనే ఆగిన పిటీషన్

హైదరాబాద్- తెలంగాణలో ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగె ప్రెసిడెంట్ కేటీఆర్ కు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ముందు నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నా, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ వ్యవహారం తోడైంది. కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్న వారందరికి బ్రాండ్ అంబాసిడర్ అని, నిజాయితీ ఉంటే కేటీఆర్ డ్రగ్ టెస్త్ చేయించుకోవాలని సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి సవాల్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను డ్రగ్ టెస్ట్ కు రెడీ అని, ఐతే రాహూల్ గాంధి కూడా పరీక్ష చేసుకోవాలని, అది కూడా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐతే తాను రావడానికి సిద్దమని ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇటివంటి సమయంలో మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

1033252 revanthktr 1

తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ పిటీషన్ లో స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు, రేవంత్ రెడ్డిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఐతే రేవంత్‌ రెడ్డిపై సిటీ సివిల్‌ కోర్టులో మంత్రి కేటీఆర్ దాఖలు చేయాలనుకున్న పిటిషన్ కు సరైన ఆధారాలు లేక కోర్టు బెంచ్‌ మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఈ పిటిషన్ సెక్షన్ ఆఫీస్‌లోనే ఉండిపోయింది. దీంతో పూర్తి ఆధారాలతో మంగళవారం పిటీషన్ ను సమర్పిస్తామని మంత్రి కేటీఆర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరేపుతున్నాయి.