104 ఏళ్ల వయసులో ఈ భామ్మ చేసిన పనికి అంతా ఫిదా

నేషనల్ డెస్క్- కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అన్నాడో కవి. నిజమే పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని చెప్పిన పెద్దల మాట చాలా సందర్బాల్లో నిరూపితం అయ్యింది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు వెళ్తే వయసుతో పనిలేకుండా ఏదైనా సాధించవచ్చు. ఇదిగో కేరళకు చెందిన ఈ భామ్మ ఈ విషయాన్ని అక్షరాల నిరూపించింది.

వందేళ్లు దాటిన కేరళ భామ్మ పలకాబలపం పట్టి, దాన్ని పెన్ను పేపరు వరకు తీసుకెళ్లి పరీక్షలు రాసి డిస్టింక్షన్‌ లో పాసై అందరిని ఆశ్చర్యంలో ముంచింది. ప్రతిభకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని నిరూపించింది ఈ పండు ముసలి. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ ఒక్కసారి కూడా బడికి వెళ్లిన పాపనపోలేదు. కానీ 104 ఏళ్ల కుట్టియమ్మ రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించే క్లాసులకు హాజరయ్యేది.

Kuttiyamma

అలా మెల్లగా రాయడం, చదవడం నేర్చుకుంది కుట్టియమ్మ. ఈ క్రమంలో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ పెట్టిన లిటరసీ పరీక్షలో 100 కు 89 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ విద్యా శాఖ మంత్రి వాసుదేవన్ శివన్‌ కుట్టి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రతిభ అనే ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి వయసు అడ్డంకి కాదని కుట్టియమ్మ నిరూపించారని ఆయన అన్నారు.

లిటరసీ పరీక్షలో 89 మార్కులు సాధించడంతో 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించింది. అన్నట్లు 104 ఏళ్ల కుట్టియమ్మకు వినికిడి సమస్య కూడా ఉంది. అందుకే పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని చెప్పింది. ఏది ఏమైనా లిటరసీ పరీక్ష రాసి వందకు 89 మార్కులు సాధించి తానేంటో నిరూపించుకుంది కుట్టియమ్మ.