శ్రీకాకుళం- సముద్రంలో వేట ఎంతో శ్రమతో కూడుకున్నది. అంతే కాదు కొన్ని సమయాల్లో ప్రమాదం కూడా. కానీ మత్యకారులు అన్నింటికి ఓర్చి సముద్రంలో చేపల వేట కొనసాగిస్తుంటారు. కుటుంబ పోషన కోసం చేపల వేట తప్పదని చెబుతారు వాళ్లు. ఐతే ఒక్కోసారి ఎన్ని చేపలు వలలో పడ్డ రాని డబ్బు, ఒక్క చేపకే వస్తుంటాయి.
ఎందుకంటే సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో కొన్ని చేపలకు బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి అరుదైన చేపే చిక్కితే ఆ రోజు మత్యకారుల పంట పండినట్టే. ఇదిగో శ్రీకాకుళంలో ఓ మత్యకారుడి వలలో ఖరీదైన చేప పడింది. ఇంకేముంది అతని ఆనందానికి అంతే లేదు.
సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లాడు. ఈయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వ్యాపారులు ఏకంగా 55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు సంతోషం వ్యక్తం చేశారు.
అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉండటంతో పాటు, చేప చాలా రుచిగా ఉంటుందని స్థానికులు చెప్పారు. అందుకే ఈ కచ్చిలి చేపకు కిలో సుమారు నాలుగు వేల రూపాయల ధర పలికింది. ఐతే ఈ చేప ఎప్పుడో గాని వలకు చిక్కదని మత్యకారులు చెబుతున్నారు.