అమెరికాలో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ బయటపడింది. క్లౌడ్‌జెన్ అనే ఓ టెక్ కంపెనీ ‘బెంచ్ అండ్ స్విచ్’ తరహా మోసానికి పాల్పడింది. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బి వీసాలు జారీ చేసింది. అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికి అడిగిన కంపెనీకి హెచ్1బి వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసింది. సాధారణంగా హెచ్1బి ప్రాసెస్ ద్వారా ఉద్యోగులను పొందడానికి సుదీర్ఘ ప్రయాస పడాల్సి ఉంటుంది. అయితే వీసాతో రెడీగా ఉన్న ఉద్యోగులను కలిగి ఉండడం క్లౌడ్‌జెన్‌కు మార్కెట్‌లో అడ్వాంటేజ్‌గా మారింది.
ఉద్యోగుల నుంచి కమీషన్ల రూపంలో 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్ల మేర వసూళ్లు చేసింది. ఇలా చేయడం వల్ల క్లౌడ్ జెన్ వద్ద రిజర్వు బెంచ్‌లో ఎప్పుడూ సిబ్బంది ఉంటారు. లేదా వీసాలకు సిద్ధంగా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. దీంతో ఆయా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా అక్కడికి సిబ్బందిని వేగంగా పంపించవచ్చు. అదే అప్పటికప్పుడు వీసా దరఖాస్తు చేసుకొంటే కొంత సమయం వృథా అవుతుంది. అలా వచ్చిన వ్యక్తికి కొత్త ఉద్యోగం దొరికి వెళ్లిపోగానే హెచ్1బీ వీసాలో యాజమాన్య మార్పిడి జరుగుతుంది. దీంతో కొత్త యజమాన్యం అతడికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ పని చూసుకొంటుంది. రికార్డుల ప్రకారం పల్లెంపాటి శశి క్లౌడ్‌జెన్ సంస్థకు ప్రెసిడెంట్‌గా వైస్ ప్రెసిడెంట్‌గా, జోమోన్ చక్కలక్కళ్ పనిచేస్తున్నారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం మానస్పాస్, హైదరాబాద్ గచ్చిబౌలి, కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. కాగా, క్లౌడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు టెక్సాస్‌లోని హూస్టన్ కోర్టులో తమ నేరాన్ని అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై చీఫ్ జడ్జి లీ రోసెన్తల్ సెప్టెంబర్‌లో తీర్పులను వెలువరించనున్నారు. మిలియన్ డాలర్ల జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.