హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చలరేగిపోతున్నారు. అమాయకులకు సైబర్ వల విసిరి, అందినంతా దోచుకుపోతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు పెరిగాక, సైబర్ నేరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. ఫోన్ లకు మెస్సేజ్ లు పంపడం, లేదంటే ఫోన్ చేసి బ్యాంకు వివరాలు తెలుసుకుని వారి ఖాతాల్లోంచి జబ్బులు కాజేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో డబ్బుల రికవరీ కూడా సాధ్యం కావడం లేదని పోలీసులు వాపోతున్నారు.
ఇదిగో ఇటువంటి సమయంలో ఓ సైబర్ నేరగాడు ఏకంగా పోలీసుకే నార్నింగ్ ఇచ్చాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. కొంత డబ్బు పోగొట్టుకున్నాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉండగానే సైబర్ నేరస్థుల నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. కొన్ని చార్జీలు చెల్లిస్తేపోయిన మీ డబ్బు వెనక్కి వచ్చేస్తుందని చెప్పారు వాళ్లు.
దీంతో తాను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నానని, పోలీస్ అధికారితో మాట్లాడాలని ఫోన్ అతనికి ఇచ్చాడు. వెంటనే సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేస్తాడని వాళ్లిద్దరు భావించారు. కానీ ఆ సైబర్ నేరగాడు ధైర్యంగా పోలీస్ అధికారితో మాట్లాడాడు. తాను సైబర్ నేరాలు చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. అంతే కాదు తన రోజు వారి సంపాదన 20 వేల నుంచి మొదలు ఎంతైనా ఉండవచ్చని తెలిపాడు. తానే కాదు తనకు తెలిసిన చాలా మంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఒప్పుకున్నాడు.
ఇక సదరు పోలీస్ అధికారికి సైబర్ నేరగాడు సవాల్ కూడా విసిరాడు. మీరు నన్ను పట్టుకోలేరని అన్నాడు. ఇప్పుడు ఫోన్ మాట్లాడిన వెంటనే తాను ఫోన్ లో సిమ్ మార్చేసి వేరే సిమ్ వేస్తానని, అలా ఎన్ని సిమ్ లు అయినా మారుస్తానని, అందుకే పోలీసులు తమను పట్టుకోలేరని కూల్ గా చెప్పడంతో పోలీసు అధికారికి ఏమాట్లాడాలో తెలియలేదట. చివరికి ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుండా జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పి బాధితున్ని పంపించేశాడట.