‘డ్రంక్ డ్రైవ్‌’ నేరగాళ్ళకి ‘రెడ్ డ్రెస్’ కోడ్!..

డ్రంక్ అండ్ డ్రైవ్‌ వల్ల అనేక మంది ప్రమాదాల బారినపడటంతో  ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మందు బాబులను మార్చాలని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదు (బీఏసీ)ను రక్త నమూనాలను విశ్లేషించి లెక్కిస్తారు. హైదరాబాద్ పోలీసులు డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడి శిక్ష ఖరారైన వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. మామూలుగా నేరాలు చేసిన వారికి తెల్ల బట్టలిస్తారు. కానీ, మందుబాబులకు మాత్రం ఎర్రటి దుస్తులు ఇవ్వనున్నారు.

Drunk and Drive 01 minమందుబాబులకు మాత్రం ప్రత్యేక డ్రెస్ కోడ్ తీసుకువచ్చారు. నేరాలు చేసిన వారికంటే మద్యం తాగి వాహనాలు నడిపేవారే అత్యంత ప్రమాదకరం అని భావన కలిగేలా ఎరుపు రంగు దుస్తులను వారికి అందిస్తున్నారు. 100 ఎంఎల్‌ రక్తంలో మద్యం మోతాదు 30 ఎంజీ లోపు ఉంటే వదిలేస్తారు. 36, అంతకంటే ఎక్కువగా ఉంటే కేసు నమోదు చేస్తారు.  

మరోవైపు హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు.  మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.