చెరువుకొమ్ముపాలెం టు చెన్నై, సీఎం స్టాలిన్ మన తెలుగు బిడ్డే

చెన్నై( ఒంగోలు)- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ ఎవరనుకుంటున్నారు.. ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు.. స్టాలిన్ తమిళుడే కదా అని అనుకుంటున్నారా.. ఐతే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే స్టాలిన్ మన తెలుగు బిడ్డ. అవును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అచ్చ తెలుగువాడు. మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటే ఇదిగో ఇక్కడ అసలు విషయం తెలుసుకొండి. స్టాలిన్ తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పూర్వీకులది మన ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లోని చెరువుకొమ్ముపాలెం. వీళ్లది తెలుగు నాయిబ్రాహ్మణ కుటుంబం. ఒంగోలు దగ్గరలోని చెరువుకొమ్ముపాలెంలో కరుణానిధి పూర్వీకుల నివాసం ఉండేవారు. ఒంగోలులోని పెళ్ళూరు సంస్ధానంలో కరుణానిధి తాత, ముత్తాతలు సంగీత విద్వాంసకులుగా పనిచేసేవారట. కరుణానిధి పూర్వీకులంతా సంగీత విద్వాంసులే. అందుకే కరుణానిధికి సైతం చిన్నప్పటి నుంచే సంగీతంపై, సాహిత్యంపై ఇష్టం ఏర్పడింది.

కరుణానిధి తండ్రి కూడా నాదస్వర విద్వాంసుడే. తన కొడుకు కూడా నాదస్వర విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుకునేవాడట. కరుణానిధి తండ్రి ముత్తువేల్ తమిళనాడు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడిపోయారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుక్కువళై అనే కుగ్రామములో 1927 జూన్‌ 3వతేదిన కరుణానిధి జన్మించారు. తమ తాత, ముత్తాతాలది తెలుగు రాష్ట్రమని తెలిసిన కరుణానిధి, తెలుగు వాళ్లంటే చాలా ఇష్టపడేవారు. తెలుగువారు ఎవరు కనిపించినా కరుణానిధి తెగ సంతోష పడిపోయేవారని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవారని ఆయన్ని కలిసిన వారు చెబుతారు. అంతే కాదు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా అయ్యాక మద్రాస్ లోని తెలుగు వాళ్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ మన తెలుగువాడేనని చెప్పడంలో తప్పులేదు కదా. స్టాలిన్ పూర్వీకులు బతుకుదెరువు కోసం తమిళనాడుకు వలసెల్లి అక్కడ సెటిల్ అయినా.. అవడానికి మాత్రం మన తెలుగువాడే కదా. ఇదన్న మాట చెరువుకొమ్ముపాలెం టు చెన్నై ప్రస్థానం.