నమ్మలేకపోతున్నాను, బీఏ రాజు మృతిపై భావోద్వేగానికి గురైన చిరంజీవి

chiranjeevi

ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో మరణించారు. శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అర్ధరాత్రి మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బీఏ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర ధిగ్బ్రాతి వ్యక్తం చేస్తున్నారు. బీఏ రాజు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం ఆయన కోసం కదిలి వస్తోంది. నిర్మాత బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. బీఏ రాజు పేరు తెలియన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరని చిరంజీవి చెప్పారు.

B A Raju

మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన తనతో షేర్ చేసుకునే వారని గుర్తు చేశారు. ప్రతీ కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునే వాడినని అన్నారు. షూటింగ్ స్పాట్‌లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారని చిరంజీవి చెప్పారు. నా చాలా సినిమాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారన్న చిరంజీవి, సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన అని అన్నారు. ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది.. ఎంత వసూలు చేసింది.. ఏ సెంటర్‌లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతీదీ పరిశ్రమకు ఎన్ సైక్లోపీడియాలా సమాచారం అందించేంత ఫ్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్ బీఏ రాజు అని చెప్పారు.

అనేక సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజు లాంటి వారు ఉండటం పరిశ్రమ అదృష్టమన్న చిరంజీవి.. అలాంటి వ్యక్తి నేడు ఇక లేరు అన్న వార్త విని షాక్‌కి గురయ్యానని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులు బీఏ రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేధన వ్యక్తం చేశారు.