తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, పత్రికాధినేతగా, ప్రముఖ పిఆర్ఓగా పేరొందిన బి.ఏ రాజు.. గతేడాది ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఏడాది పూర్తికావడంతో ఆయనను స్మరించుకుంటూహైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో ప్రథమ వర్థంతిని నిర్వహించారు. బి.ఏ రాజు మొదటి వర్థంతి కార్యక్రమానికి ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మిత్రులు, తోటి పాత్రికేయులు ఇండస్ట్రీతో బి.ఏ రాజుకు ఉన్నటువంటి అనుబంధాన్ని, ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలనుగుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బిఏ రాజును టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ స్మరించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “బీఏ రాజు నా అభిమాని. విజయవాడ వెళ్ళినప్పుడల్లా కలుస్తుండేవాడు. ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకెళ్ళాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రికమండ్ చేయండి.. అని అడిగితే నేనే జ్యోతిచిత్రకు రిఫర్ చేశాను.
తర్వాత రకరకాల పేపర్లలో పనిచేశాడు. పరిశ్రమలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా ‘సూపర్ హిట్’ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ వన్ పత్రికగా తీర్చిదిద్దాడు. అమెరికాలో కూడా పాపులర్ అయ్యేంతగా సూపర్ హిట్ పత్రికను అభివృద్ధి చేశాడు. తర్వాత నిర్మాతగా సినిమాలు తీశాడు. కానీ అతను ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం’ అని కృష్ణ అన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సూపర్ స్టార్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.