కరోనాకు నెల్లూరు మందు పనిచేస్తుందా.. పరీక్షల్లో ఏం తేలబోతోంది

నెల్లూరు రూరల్- ఇది కరోనా కాలం.. ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషధం లేక, జనాలకు కావాల్సిన మేర వ్యాక్సిన్ అందుబాటులోకి రాక, వైద్య సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వచ్చిన వారు దాన్నుంచి ఎలా భయటపడాలని తాపత్రయపడుతోంటే.. మిగతా వారు కరోనా రాకుండా ఏంచేయాలో అన్నదానిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎవరు ఏంచెప్పినా నమ్మెస్తున్నారు. కరోనా రాకుండా అది చేస్తే మంచిది, కరోనా వస్తే ఇది చేస్తే తగ్గిపోతుందని ఎక్కడ చూసినా ఇదే ప్రచారం. వైద్యులు ఒకటి చెప్తారు, మీడియాలో మరొకటి వస్తుంది, ఆంతర్జాతీయ నిపుణులు ఇంకోటి చెబుతారు.. ఎవరి చెప్పింది నమ్మాలో.. ఏది ఫాలో కావాలో తెలియక అందరు తికమక పడిపోతున్నారు.

ఇటువంటి సమయంలో ప్రజలు ఆయుర్వేద మందులు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనా వైరస్ నివారణకు ముందస్తుగా ఆయుర్వేదం మందులు వాడుకుంటున్నారు. కరోనా వైరస్ వచ్చినా, రాకపోయినా ఈ ఆయుర్వేదం మందులు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో కరోనా మెడిసన్ పేరుతో ఆయుర్వేద మందును అందిస్తున్నారు. వివిధ రకాల ఆకులు, తేనే, శొంఠి, మిరియాలు, అల్లం, ధనియాలు, ఇలా కొన్ని రకాల వస్తువులతో కషాయం, తైలం తయారు చేసి వచ్చిన వారికి ఉచితంగా ఇస్తున్నారు. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున వచ్చి ఈ మందును తీసుకువెళ్తున్నారు.

Ayurveda

ఈ ఆయుర్వేద మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని అంతా చెబుతున్నారు. కరోనా సోకిన వారికి రెండు మూడు రోజుల్లో నెగిటివ్ వస్తోందని మందు వాడిన వారు అంటున్నారు. ఐతే ఈ ఆయుర్వేదిక మందుపై కొందరు లోకాయుక్త కు పిర్యాదు చేశారు. ఇలాంటి నాటు మందుల వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పని పిటీషన్ దాఖలు చేశారు. దీంతో లోకాయుక్త నెల్లూరు కలెక్టర్ ను వివరణ కోరింది. వెంటనే డీఎంహెఓ కృష్ణపట్నం వెళ్లి విచారణ జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కరోనాకు మందు పంపిణి చేయడం ఏంటని నిర్వాహకులను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు.

ఈ ఆయుర్వేద మందుపై ప్రజలెవ్వరు వ్యతిరేకంగా గాని, మందు వల్ల హానీ జరిగిందని గాని పిర్యాదు చేయలేదని కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన నివేధికలో పేర్కొన్నారు. అంతే కాదు ఈ కరోనా మందును పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ ఆయుష్ శాఖ ను కోరినట్లు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఆయుర్వేద మందుపై పరీక్షలు జరుగుతున్నాయి. మరి పరీక్షల్లో ఏంతేలుతుందన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఐతే స్థానికులు మాత్రం ఈ కరోనా మందు వల్ల చాలా మంది కోలుకున్నారని, తమకు ఈ మందే కావాలని చెబుతున్నారు.