స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని ప్రచారం జరగడంతో ఒక్క సారిగా అందరి చూపు ఈ ఔషధంపై పడింది. కరోనా రోగులంతా కృష్ణపట్నం తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రోజుకు కేవలం మూడు వేల మందికి మాత్రమే మందు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా.. వేలాది మంది ఈనందయ్య మందు కోసం బారులు తీరారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50వేల మంది వరకు ఆయుర్వేద మందు కోసం తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయుర్వేద మూలికలతో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఈ కరోనా మందుపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఔషధం యెక్క శాస్త్రీయతపై పరిశీలనకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీఎంఆర్ ఆనందయ్య కరోనా మందుపై పరిశోధ మొదలుపెట్టింది. వారం రోజుల పాటు మందు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంతో ఆశతో దూర ప్రాంతాల నుంచి కరోనా మందు కోసం వచ్చిన వారు మందు దొరక్కపోవడంతో నిరాశ చెందారు. దీన్ని అవకాశంగా చేసుకున్న కొందరు బ్లాక్ దందాకు తెరలేపారు. మందు అత్యవసరంగా కావాల్సిన వారిని సంప్రదిస్తూ ఒక్కో ప్యాకెట్ 5 వేల రూపాయల నుంచి 10వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వారు అంత ఇచ్చి కొనుక్కుంటున్నా, కొంత మంది అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో 3 నుంచి 5వేలు తీసుకుని మందు ప్యాకెట్లు అమ్ముతున్నారు.
ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది దగ్గర బ్లాక్ దందాగాళ్లు శుక్రవారం ఒక్కరోజే లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆనందయ్య కరోనా ఔషధం బ్లాక్ దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఆశలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయుర్వేద మందు కోసం వస్తున్న వారిని ఇలా దోచుకోవడం సరికాదని అంటున్నారు. ఐతే ఇది ఆనందయ్యను అప్రతిష్టపాలు చేయడం కోసమే కొందరు ఇలా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి కరోనా మందు బ్లాక్ దందాను ప్రభుత్వం ఏ మేరకు కట్టడి చేస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.