నెల్లూరు- అమరావతి- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మానవాళి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఆనందయ్య తరతరాల నుంచి వస్తున్న వంశపార్యంపర మేరకు కరోనాకు ఆయుర్వేద మందును కనిపెట్టారు. గత కొన్ని రోజులుగా అతను చుట్టుపక్కల వారికి ఈ మందును ఇస్తండగా.. చాలా మందికి కరోనా తగ్గిపోయిందని చెబుతున్నారు. ఇక ఈవిషయం ఆంతటా ప్రచారం కావడంతో చుట్టు పక్కల గ్రామాల వారే కాకుండా, ఇతర జిల్లాలు, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున కరోనా రోగులు మందు కోసం వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు.
అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో, శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. ఐతే కేవలం మూడు వేల మందికి మాత్రమే మందును తయారు చేయడంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. మరోవైపు చాలా మంది కరోనా రోగులు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు నెల్లూరు కరోనా మందు విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని మరీ కోవిడ్ రోగులు కృష్ణపట్నం తరలి వెల్తుండటం పట్ల జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. ఆయుర్వేద మందు యొక్క ప్రామాణికతను తెలుసుకోవాలని అధికారును ఆదేశించారు. ఈమేరకు సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్లానికి చెందిన ఐసీఎంఆర్ బృందం నెల్లూరు రాబోతోంది. కరోనాకు ఆనందయ్య తయారు చేసిన ఔషధంపై ఐసీఎంఆర్ అధ్యయనం చేయనుంది. ఆ తరువాత ఐసీఎంఆర్ నివేధికను బట్టి, ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయాలా వద్దా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఐసీఎంఆర్ నివేధికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.