టీ20 ప్రపంచ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా

స్పోర్ట్స్ డెస్క్- టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ ను ఆస్ట్రేలియా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్‌ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారి టీ20 కప్‌ ని గెలిచింది ఆస్ట్రేలియా. మిచెల్‌ మార్ష్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్‌) అదరగొట్టే ఆటతీరుతో జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.

డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్‌) కీలకంగా నిలిచారు. బౌల్ట్‌ కు రెండు వికెట్లు దక్కాయి. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85: 48 బంతుల్లో 10×4, 3×6) చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

davidwarnert20worldcup

అనంతరం ఛేదనలో మిచెల్ మార్ష్ (77 నాటౌట్: 50 బంతుల్లో 6×4, 4×6), డేవిడ్ వార్నర్ (53: 38 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడటంతో.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 173/2తో విజయాన్ని అందుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మిచెల్‌ మార్ష్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా వార్నర్‌ నిలిచారు. 173 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ (5) ఆరంభంలోనే ఔటైనా, మూడో స్థానంలో బ్యాటింగ్‌ కి వచ్చిన మిచెల్ మార్ష్‌ తన ప్రతాపం చూపించాడు.

వచ్చిన ప్రతి బంతిని బలంగా బాదుతూ వచ్చిన మిచెల్ మార్ష్, రెండో వికెట్‌కి డేవిడ్ వార్నర్‌ తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్ దూకుడుతో వార్నర్ కూడా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకి భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ తర్వాత టీమ్ స్కోరు 107 వద్ద వార్నర్ ఔటవగా, చివర్లో గ్లెన్ మాక్స్‌వెల్ (28 నాటౌట్: 18 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి 18.5 ఓవర్లలోనే మిచెల్ మార్ష్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 35 బంతుల్లో 3×4), డార్లీ మిచెల్ (11: 8 బంతుల్లో 1×6) మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ లోనే హేజిల్‌ వుడ్ బౌలింగ్‌లో మిచెల్ ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన కేన్ విలియమ్సన్ చాలా సేపటి వరకూ బ్యాట్ ఝళిపించే సాహసం చేయలేకపోయాడు. దాంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 57/1తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది.