అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి చాలా అంశాలు పెంగింగ్ లో ఉన్నాయి. దీంతో చాలా కాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని టాలీవుడ్ సినీ పెద్దలు జగన్ సర్కారును కోరుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఓ సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ తరువాత మళ్లీ సినీ పెద్దలు సీఎం ను కలవాలన్నా ఇంతవరకు జగన్ వారికి సమయం ఇవ్వలేదు.
ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలను కలిసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని చిత్రపరిశ్రమ బృందం కలువబోతోంది. ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. కరోనా కష్ట కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తామని చిరంజీవి నేతృత్వంలోని బృందం ప్రభుత్వానికి కబురు పంపించింది.
ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ అడిగారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించుకుంటామంటూ చిరంజీవి బృందం కోరుతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి పేర్ని నాని వివరించారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన చిత్ర పరిశ్రమ నేతలను ఆహ్వానించాలని మంత్రి పేర్ని నానికి సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని చిరంజీవికి సమాచారం అందించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్ ముందు పలు అంశాలను ఉంచబోతున్నారు.
అందులో ప్రధానంగా కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలని కోరబోతున్నారు. మరోవైపు గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని విజ్ఞప్తి చేయబోతున్నారు. సినీ కార్మికులకు సంబందించిన మరికొన్ని సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు చిరంజీవి బృందం సమాయుత్తం అవుతోంది. వీటితో పాటు ప్రభుత్వమే నేరుగా సినీ టికెట్ల విక్రయించాలని నిర్ణయించిన నేపధ్యంలో, ఈ అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.