బుధవారం అమరావతిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని… ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారో ఒకసారి చూడాలని చురకలు అంటించారు. పవన్ కల్యాణ్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన వంతు కృషే లక్ష్యమని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సమాజాంలోని ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తారని చెప్పారు. ఆయన కష్టపడి జనసేన పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. సినిమా పరిశ్రమకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ అడిగారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. సినీ పరిశ్రమను నమ్ముకొని వేల మంది బతుకుతున్నారని.. మీ నిర్ణయాల వల్ల వారికి అన్యాయం చేయొద్దని పవన్ కళ్యాణ్ అడగడం తప్పా అని ప్రశ్నించారు. ఇది అర్థంకాని మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీని కాపాడమంటే పవన్‌ను కాపాడమని అర్థం కాదని ఆయన అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్‌పై కొందరు వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమయంలో జనసైనికులు, పవన్ అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోవద్దని, దృష్టిని మళ్లించడానికే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన చెప్పారు. జనసేన బలమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందన్నారు నాదెండ్ల మనోహర్. జనసైనికులపై అక్రమంగా కేసులు పెడితే లీగల్ సెల్ చూసుకుంటుందన్నారు. పవన్ వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా… ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కరోనా సమయంలో జగన్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? అని ప్రశ్నించారు. తుపానులు వచ్చినప్పుడు జగన్ ఎక్కడని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.