లాక్‌డౌన్‌ ఉల్లంఘన – సినీ హీరో నిఖిల్‌ కారుకు చలానా!…

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలీసులు అడుగడుగునా చెక్ పోస్ట్ పెట్టి ఎవర్నీ రోడ్లపైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. రోజులో సడలింపు ఇచ్చిన 4 గంటల కాలంలోనే అన్ని కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. 10 తర్వాత కనిపించినవారిని పోలీసులు అస్సలు వదలడం లేదు. మీడియా, అత్యవసర సేవల వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించారు.

jpg

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్‌ కారులో లేడని పోలీసులు తెలిపారు. కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య కూడా లాక్‌ డౌన్ అమలులో ఉన్న సమయంలో నిఖిల్‌ రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ కోసం అత్యవసరంగా మందులు తీసుకెళ్లేందుకు బయటకు వచ్చారు. ఆ మందులతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌ డౌన్‌లో ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించగా.. నిఖిల్ పరిస్థితిని వివరించారు. మందుల ప్రిస్క్రిప్షన్, పేషెంట్ వివరాలు చూపించినా పోలీసులు వదలలేదు. లాక్ డౌన్ సమయంలో ఈ పాస్ ఉండాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. నిఖిల్‌ ప్రస్తుతం ’18 పేజీస్‌’ సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నాడు.