రాత్రిపూట రైలు ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా కొన్ని నిబంధనలను తెలుసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ మీద చర్యలు తప్పవు. మరి ఆ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి.
మీరు రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే భారతీయ రైల్వే నిబంధనలను అనుసరించకపోతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో రైల్వే ప్రయాణికుల ప్రయాణం సుఖంగా సాగడం కోసం భారతీయ రైల్వే కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ నిబంధనలు ప్రతీ ప్రయాణికుడు పాటించాల్సిందే. రాత్రి 10 తర్వాత సెల్ ఫోన్ లో గట్టిగా మాట్లాడడం, ఫోన్ లో పాటలు పెట్టి పెద్ద సౌండ్ పెట్టడం వంటివి చేయకూడదు. చాలా మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. అలాంటి వారు రాత్రి ఎంత సమయమైనా నిద్రపోకుండా గట్టిగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వంటివి చేస్తుంటారు.
ఇలాంటి వారి వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇలా చేయకూడదన్న నిబంధన అది. రాత్రి 10 దాటిన తర్వాత నైట్ ల్యాంప్ లేదా సెల్ లైట్ తప్పించి వేరే లైట్లు ఆన్ చేయకూడదు. ఒకవేళ అంతగా ఆన్ చేయాల్సి వస్తే తోటి ప్రయాణికుడి అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆ ప్రయాణికుడికి లైట్ వేసినందుకు మీపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. రైల్వే నిబంధనలు ప్రయాణికులకు మాత్రమే కాదు.. టీటీఈలకు కూడా వర్తిస్తాయి. రాత్రి 10 తర్వాత ప్రయాణికుడు నిద్రపోతున్న సమయంలో టికెట్ చూపించమని అడిగితే ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ప్రయాణికులు తమ సీట్లలోనే ఉండాలి.
ఆ సమయంలో ఇతర ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా అప్పర్ బెర్త్ వారిని, లోయర్ బెర్త్ వారిని, మిడిల్ బెర్త్ వారిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మిగిలిన సమయాల్లో కూర్చోవాలంటే లోయర్ బెర్త్ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అయితే వికలాంగులు, గర్భిణీలు, వయసు పైబడ్డ వారికి ఈ నిబంధనలు వర్తించవు. ఏ సమయంలో అయినా వారు నిద్రపోయేందుకు అనుమతి ఉంది. ఈ విషయంలో వారికి తోటి ప్రయాణికులు సహకరించాలి. పై నిబంధనల్లో మీరు ఏ నిబంధనను ఉల్లఘించినా మీ మీద ఫిర్యాదు చేసే అవకాశం మీ తోటి ప్రయాణికుడికి ఉంటుంది. అలానే మిమ్మల్ని ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లఘించడం ద్వారా ఇబ్బంది పెడితే మీరు కూడా ఫిర్యాదు చేయవచ్చు.