మనం ఎక్కడో చేసే మంచి.. ఇంకెక్కడో మనకి తిరిగి వస్తుంది అంటారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో ఇప్పుడు ఇదే నిజం అవుతోంది. మెగా మేనల్లుడు తేజ్ క్షేమంగా తిరిగి రావాలని.. విజయవాడలోని ఓ కాలనీలో వందల మంది వృద్దులు ఉపవాసం ఉంటున్నారు. అదేంటి.. సాయి తేజ్ యూత్ ఫుల్ హీరో. ఆయన కోసం యంగ్ స్టర్స్ ఉపవాసం ఉంటున్నారు, పూజలు చేస్తున్నారు అంటే.. ఏదో అభిమానం కొద్దీ అని అర్ధం చేసుకోవచ్చు. మరి.. సాయి ధరమ్ తేజ్ కోసం వృద్దులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? అసలు వారికి, సాయి తేజ్ కి సంబంధం ఏమిటి అని ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ మంచి మనసు ఎలాంటిదో అర్ధం అవుతోంది.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అన్నీ వర్గాల ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే.., తేజ్ కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ విజయవాడ వాంబే కాలనీలో ఉంటున్న “అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ”లో వందల మంది వృద్దులు ప్రార్ధనలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న సమయం నుండి ఆ ఆశ్రమంలో వృద్దులు అన్నం తినకుండా, దేవుణ్ని వేడుకుంటున్నారు. వీరంతా సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ కన్నీరు పెట్టుకుంటుండటం విశేషం.
విజయవాడలోని “అమ్మ ప్రేమ ఆదరణ” వృద్దుల ఆశ్రమం నిర్మాణం కోసం సాయి తేజ్ చాలా కష్టపడ్డారు. ఈ భవనం కోసం తేజ్ భారీగా విరాళం కూడా ఇచ్చారు. తనకి కాస్త సమయం దొరికినా తేజ్ ఈ ఆశ్రమానికి వచ్చి.. అందరి అవసరాలు తీరుస్తుంటారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తుంటారు. సాయి తేజ్ తో ఇంతటి అనుబంధం ఉంది కాబట్టే..అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితిలో వృద్దులు ఇంతలా బాధ పడుతూ ప్రార్ధనలు చేస్తున్నారు. వీరి ప్రార్ధనలు ఫలించి.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.