‘హోమ్ స్వీట్ హోమ్’ అంటారు కదా.. అదే ఆ హోమ్ లో ఎలుకలు ఉన్నాయనుకో.. అది స్వీట్ హోమ్ కాదు చిరాకు హోమ్ అవుతుంది. ఎంతో మందికి అది ప్రత్యక్షంగా అనుభవం కూడా అయ్యే ఉంటుంది. ఎలుకలను కట్టడి చేసేందుకు మార్కెట్లోకి ఎన్నో వస్తువులు, కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, అలా వాటిని చంపాలంటే మనసొప్పదు.. వాటిని భరించాలంటే మన సహనం సరిపోదు. అందుకే మేము చెప్పే ఈ చిన్న చిట్కాలను ఫాలో అయితే వాటిని ఇట్టే తరిమేయచ్చు. వాటికి కూడా ఎలాంటి ప్రాణహాని ఉండదు.
లవంగాయలు
ఎలుకలను తరిమి కొట్టాలంటే సింపుల్ చిట్కా లవంగాయలను వాడటమే. అవును ఆ వాసన వాటికి పడదు. లవంగాయను చూస్తే ఎలుక ఆమడదూరం పారిపోవాల్సిందే. వాటిని చిన్న మూటగా కట్టి అవి వెళ్లే కన్నాల వద్ద ఉంచితే దెబ్బకు పారిపోవాల్సిందే.
పుదీనా తైలం
పుదీనా స్మెల్ అంటే ఎలుకలకు నచ్చదు. దూదిని పుదీనా తైలంలో ముంచి ఇంట్లో అక్కడక్కడ ఉంచితే ఆ వాసనకు ఎలుకలు పరారవుతాయి.
కారంపొడి
ఎక్కువ ఎలుకలు ఉండి.. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయా? అలాంటి సందర్భాల్లో కారం పొడిని ఒక పాత గుడ్డలో కట్టి ఎలుకల కన్నాల్లో పెట్టండి. ఆ దెబ్బతో ఎలుకలు చిత్తగించాల్సిందే.
బేకింగ్ సోడా
ఇంకా ఆ ఎలుకలు ఓటమిని అంగీకరించకపోతే.. ఆఖరి ప్రయత్నంగా ఇది ప్రయత్నించండి. ఈసారి మాత్రం కచ్చితంగా పారిపోవాల్సిందే. రాత్రి ఇంట్లో ఫ్లోర్ పై అక్కడక్కడ బేకింగ్ సోడా చల్లండి. బేకింగ్ సోడా అంటే ఎలుకలకు చాలా భయం. తెల్లారిన తర్వాత చీపురుతో ఆ బేకింగ్ సోడాను అటూ ఇటూ కదుపుతూ దుమ్ము లేచేలా చేయండి. అలా చేయడం వల్ల బేకింగ్ సోడా గాలిలో కలుస్తుంది. అది గనుక ఎలుకలు పీలిస్తే.. ఇంక ఇల్లు వదిలి పారిపోవాల్సిందే.
ఇలాంటి చిట్కాలతో ఇంట్లో నుంచి ఎలుకలను తరిమేయచ్చు. ఇవి ట్రై చేయండి.. వాటి ప్రాణాలను హాని కలిగించకుండా వాటిని ఇంట్లో నుంచి సాగనంపవచ్చు. వాటి దారిన అవి ఏ కలుగో వెతుక్కుంటాయి.