ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెడుతున్న తీరు చూస్తే అది అంత తేలికైన అంశం కాదనే చెప్పాలి. అయితే అన్ని రంగాల్లో ఆఫర్స్, డీల్స్ నడుస్తున్నట్లుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇది మంచి ఆఫర్స్ నడిచే కాలంగా చెబుతున్నారు.
ఎవరు ఎంత సంపాదించినా? ఎన్ని ఆస్తులు కొనుగోలు చేసినా కూడా సొంత ఇల్లు అనేది కచ్చితంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇందుకు కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త అయినా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులైనా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. చేతిలో డబ్బులున్న వాళ్లు అయితే అనుకున్నదే తడవుగా ఇల్లు కొనడం, స్థలంలో ఇల్లు కట్టించుకోవడం చేస్తుంటారు. కానీ, ఉద్యోగం చేస్తూ.. నెల జీతం తీసుకునే వాళ్లకి మాత్రం అనుకోగానే కొనేయడం అంత తేలిక కాదు. వారికంటూ కొంత సమయం కావాలి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వారి సేవింగ్స్ కి తగ్గ ప్రాపర్టీ దొరికినప్పుడు కొనుగోలు చేస్తారు. పైగా లోన్ ఫెసిలిటీలు, ఈఎంఐ సదుపాయాలు గురించి కూడా ఆలోచిస్తారు. అయితే అలాంటి వారికి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయం అని చెప్పచ్చు.
సాధారణంగా మీరు ఏ వస్తువు కొన్నా గానీ.. దానిపై ఆఫర్స్ ఏమున్నాయి? డిస్కౌంట్ లభిస్తుందా? మనం ఎంత వరకు సేవ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి తరుణం రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తోంది. మీరు సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్నా, సొంత ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నా కూడా ఇదే సరైన సమయం అంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే వాళ్లేమీ సాధారణంగా ఉండే ఆఫర్స్ గురించి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితి మీరు మిస్ చేసుకుంటే మరో ఐదేళ్ల వరకు మీకు ఇలాంటి ఆఫర్స్ దొరక్కపోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మళ్లీ ఇలాంటి పరిస్థితులు రావాలంటే మీరు మళ్లీ ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా స్తబ్దుగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయం అనగానే మార్కెట్ లో కాస్త అనిశ్చితి ఏర్పడుతుంది. ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లో కొనుగోళ్లు భారీగా తగ్గిపోతాయి. ఎన్నికల ఫలితాల ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై పడుతుందని ఎన్నికలకు 8 నుంచి 9 నెలల ముందు నుంచే కొనుగోళ్లు చేయడం ఆపేస్తారు. బిల్డర్లు కూడా కొత్త వెంచర్ల విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక వస్తువు సప్లై ఎక్కువగా ఉండి.. డిమాండ్ తక్కువగా ఉంటే దాని ధర తగ్గుతుంది. ఇప్పుడు ఆ సింపుల్ ఫార్ములానే రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కనిపిస్తోంది.
నిజానికి గత 4 నెలల కాలంలో ప్రాపర్టీ అమ్మకాలు 40 నుంచి 50 శాతం డౌన్ అయ్యాయి. అందుకు ప్రధాన కారణం ఎన్నికలు అనే చెబుతున్నారు. తెలంగాణలో అయితే మళ్లీ వచ్చే జనవరి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు మళ్లీ ధరలు పరుగులు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఏపీలో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగానే ఉందంటున్నారు. అక్కడ కూడా ఎన్నికల తర్వాతే ప్రాపర్టీ అమ్మకాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే విక్రయదారుల సంగతి పక్కన పెడితే.. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే డిమాండ్ తక్కువగా ఉన్నందుకు మీకు ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలపై బేరసారాలు చేసేందుకు ఆస్కారం లభిస్తుంది.
కొత్త వెంచర్లు కూడా ఇలాంటి సమయంలో ప్రారంభం అయ్యేందుకు తక్కువ ఆస్కారం ఉంటుంది. మార్కెట్ రన్నింగ్ లో లేనందున కాస్త లాభాలు తగ్గించుకుని అయినా ఉన్న వరకు అమ్ముకుందామని బిల్డర్లు కూడా భావిస్తుంటారు. పైగా బ్యాంకులు కూడా హోమ్ లోన్స్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉన్న సమయం కాబట్టి.. వాళ్లు కూడా మీకు ఆఫర్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. మీరు గనుక ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే.. మీకు గరిష్టంగా రూ.10 లక్షలు కూడా సేవ్ చేసుకునే వీలుంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సరైన కస్టమర్స్ ఈ సమయాన్ని క్యాష్ చేసుకుని ఇలాంటి తరుణంలో కొనుగోళ్లు జరుపుతారని చెబుతున్నారు. అయితే ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని అనుమతులు, డాక్యుమెంట్లు ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేసేందుకు ముందుకెళ్లాలి.