సమాజంలో ప్రతి వ్యక్తికి కూడు, గూడు, గుడ్డ అనేవి కనీస అవసరాలు. ఈ అవసరాలను తీర్చుకోవడం కోసం నిత్యం శ్రమిస్తుంటారు. ప్రతి ఒక్కరు తమకు సొంత ఇళ్లు ఉండాలని కలలుకంటుంటారు. దానికోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అలా కష్టపడి తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది తమ ఇళ్లను ఉన్నచోటు నుంచి కొంత ఎత్తుకు పెంచడమో, లేదా పక్కకు జరపడమో చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టే చర్యల్లో రోడ్డు పై ఉన్న భవనాలను కూల్చేస్తుంటారు. అలాంటి సమయంలో ఇంటి యజమానులు ఇళ్లు నష్టపోకుండా హైడ్రాలిక్ జాకీలతో కొంత దూరం జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విధంగా ఓ వ్యక్తి తన బిల్డింగ్ రోడ్డు కంటే కిందికి ఉందని భావించి పైకి లేపాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. అదుపు తప్పి పక్కభవనంపై ఒరిగింది. దీంతో ఆ ఇంట్లో నివసించే వారు, స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇళ్లు రోడ్డు కంటే కిందికి అయ్యిందని వర్షాలు కురిసినప్పుడు వరద నీరు చేరుతోందని ఆ ఇంటి యజమాని ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని పలువురితో చర్చించగా వారు హైడ్రాలిక్ జాకీలతో ఇంటి ఎత్తును పెంచవచ్చు అనే సలహా ఇచ్చారు. వారి సలహామేరకు హైడ్రాలిక్ జాకీలతో ఇంటి ఎత్తును పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ జాకీలు అదుపు తప్పి ఆ బిల్డింగ్ పక్కనున్న మరో భవనంపై ఒరిగింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుత్భుల్లాపూర్ లో చోటుచేసుకుంది.
కుత్భుల్లాపూర్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన నరసింహారావు సుమారు 20 సంవత్సరాల క్రితం జీ ప్లస్ టు భవనం నిర్మించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు వేయడంతో బిల్డింగ్ రోడ్డు కిందికి అయ్యింది. దీంతో వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పలువురి సలహామేరకు హైడ్రాలిక్ జాకీలతో భవనం హైట్ పెంచేందుకు పనిమొదలుపెట్టాడు. శనివారం సాయంత్రం బిల్డింగ్ పైకి లేపే క్రమంలో సుమారు పది ఇంచులు పైకి లేచిన భవనం జాకీలు అదుపుతప్పి పక్క భవనం పై ఒరిగింది. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వారు భయంతో పరుగులు తీశారు. పక్క బిల్డింగ్ యజమాని జిహెచ్ ఎంసి అధికారులకు సమాచారం అందించాడు. సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య, మిగతా అధికారులు అక్కడికి చేరుకుని బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. రక్షణ చర్యలు తీసుకుని అక్కడి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేయాలని నిర్ణయించినట్లు జిహెచ్ ఎంసి అధికారులు తెలిపారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ మరమ్మత్తులు చేపట్టిన ఓనర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.