సులభతరంగా ప్రయాణించేందుకు మెట్రోలు తెస్తుంటే.. కొంత మంది రైళ్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంత మంది డ్యాన్సులు, సెల్ఫీలు తీసుకుని ఫేమస్ అవుతుంటే, మరికొంత మంది వెకిలీ చేష్టలకు దిగుతున్నారు. దీని వల్ల నవ్వులు పాలవుతున్నారు.
రద్దీ నగరాల్లో ఎటైనా ప్రయాణించాలంటే కారు, బస్సుల్లోనే లేదా ఆటోల్లోనే గంటల తరబడి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్ అయ్యిందా ఇక ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. అయితే వీటిని గ్రహించిన కొన్ని రాష్ట్రాలు.. మెట్రో వంటి రైలు సదుపాయాలను తీసుకువచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే నగరంలో ఆ మూల నుండి ఈ మూలకు చేరుస్తున్నాయి. ఈ మెట్రోలో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యే ఉండదు. దీనికి తోడు త్వరగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. అయితే కొంత మంది ఈ మెట్రో స్టేషన్లలో, రైళ్లల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంత మంది డ్యాన్సులు, సెల్ఫీలు తీసుకుని ఫేమస్ అవుతుంటే, మరికొంత మంది వెకిలీ చేష్టలకు దిగుతున్నారు.
ఫేమస్ అవ్వడం కోసం ఇటీవల మెట్రోలో చిల్లర పనులు చేసి తిట్లు తింటున్నారు కొందరు. కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడాలు, డ్యాన్సులు చేయడం, లేదంటే ఎక్సర్ సైజులు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బికినీలో కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మర్చిపోక ముందే.. తాజాగా ఓ పోరడు గలీజు పని చేసి వార్తల్లో నిలిచాడు. ఇతగాడు కూడా ఉన్నపళంగా ఫేమస్ అవుదామనుకున్నాడేమో.. ఏమో.. ప్రయాణీకుల మధ్య రోత పనులు చేశాడు. ఇది కూడా ఢిల్లీ మెట్రోలోనే. బ్రష్ చేసుకుంటూ.. అటు, ఇటు తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు.
పళ్లు తోముతుంటే.. ఎవరి రియాక్షన్ ఎలా ఉందో కూడా వీడియో తీసుకున్నాడు. అతడి చర్యను చూసి ప్రయాణీకులంతా అవాక్కు అయ్యారు. వైరల్ అయ్యేందుకే ఈ పని చేశాడేమో తెలియదు. అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. ఇటీవల చాలా మంది ఇటువంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారుతున్న సంగతి విదితమే. ఈ చర్యలను కొంత మంది ఫన్నీగా తీసుకుంటుంటే.. మరికొన్ని సార్లు సీరియస్ అవుతున్నాయి. కొంత మంది ఆకతాయిలపై కేసులు నమోదైన దాఖలాలు ఉన్నాయి.