చాలా మంది కలలు కంటారు.. కానీ వాటిని కొంతమందే సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తుంది.. ప్రతి చిన్న లావాదేవీలు డిజిటల్ పద్దతుల్లోనే సాగుతున్నాయి. ఈ క్రమంలో చిల్లర అంటే చాలా మంది చిరాకు పడుతున్నారు.. కానీ కొంత మంది చిల్లరతోనే తమ కల నెరవేర్చుకుంటున్నారు. సంవత్సరాలుగా పోగేసిన చిల్లర నాణేలతో బైక్ షోరూమ్స్ కి వెళ్లి తమ డ్రీమ్ బైక్ కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. తాజాగా మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు చిన్నప్పటి నుంచి చిల్లర పోగు చేసి తనకు నచ్చిన స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఇటీవల పాలిటెక్నిక్ డిప్లమా కంప్లీట్ చేశాడు. వెంకటేశ్ కి చిన్నప్పటి నుంచి ఒక మంచి స్పోర్ట్స్ కారు కొనాలనే ఆశ ఉండేది.. అందుకోసం తనకు ఎవరు చిల్లర ఇచ్చినా వాటిని జాగ్రత్తగా దాచుకోవడం ప్రారంభించాడు. ఆ విధంగా వెంకటేష్ చిన్నప్పటి నుంచి రూ.2.58 లక్షల వరకు చిల్లర పోగు చేశాడు. ఇక ఆ చిల్లర మొత్తం 112 సంచుల్లో నింపుకొని దగ్గరలోని బైక్ షోరూం కి వెళ్లాడు. ముందుగానే షోరూమ్ యజమానితో విషయం చెప్పడంతో అతని కల సాకారం చేసేందుకు వారు కూడా చిల్లర స్వీకరించాడానికి ఒప్పుకున్నారు. కాకపోతే చిల్లర లెక్కించడానికి కనీసం ఒక రోజు పడుతుందని.. ఆ తర్వాత బైక్ అందిస్తామని చెప్పారు.
వెంకటేశ్ తెచ్చిన చిల్లర 15 మంది షోరూమ్ సిబ్బంది నాన్ స్టాప్ గా లెక్కించారు.. ఇక లెక్క సరిపోయిన తర్వాత వెంకటేష్ కి స్పోర్ట్స్ బైక్ అప్పగించారు. ఇక తాను చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్న స్పోర్ట్స్ బైక్ చేతికి రావడంతో వెంకటేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది నెటిజన్లు వెంకటేష్ ని అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు.. కానీ అవి కొంత మంది మాత్రమే కష్టపడి నెరవేర్చుకుంటారు.. అలాంటి వారిలో వెంకటేష్ ఒకరు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.