ఏపీలో రగులుతున్న పీఆర్సీ వివాదంపై స్పందిస్తూ.. ఓ నాయకుడు.. ప్రభుత్వ టీచర్లు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటారు.. కానీ వారు చదువు చెప్పే బడిలో తమ పిల్లలను చదివించరని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా ఈ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించరనేది అక్షర సత్యం. ఇక కలెక్టర్ స్థాయి ఉద్యోగులైతే.. ఇంటర్నెషనల్ పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఇందుకు పూర్తి విభిన్నమైన వార్త. ఓ కలెక్టరమ్మ తన కుమారున్ని అంగన్ వాడి కేంద్రంలో చేర్పించి.. పలువురుకి ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు…
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కుమారుడి పేరును అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. రాయిగిరి అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో భాగంగా బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లగా.. కలెక్టర్ తన కుమారుడు నైతిక్ సత్పతి పేరును అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. 35 నెలల వయసున్న కలెక్టర్ కుమారుడికి అంగన్‌వాడీ టీచర్లు నెలకు సరిపడా బాలామృతం, 16 గుడ్లు అందజేశారు. నైతిక్ సత్పతికి 36 నెలలు నిండిన తర్వాత (మూడేళ్లు) అంగన్‌వాడీ కేంద్రానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.సామాన్యులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపని ఈ రోజుల్లో.. ఓ కలెక్టర్ తన కుమారుడిని అంగన్ వాడీ కేంద్రంలో జాయిన్ చేయడం నిజంగా హర్షనీయం. విషయం తెలిసిన ప్రజలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.