టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తూ కొత్త బస్సులు తీసుకొస్తోంది. అదిరిపోయే లుక్, లగ్జరీ ఫీచర్లతో పాటు ఎన్నో సౌకర్యాలను ఈ బస్సుల్లో కల్పిస్తోంది.
ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించడం కోసం టీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. తమ సర్వీసులను పెంచుకునేందుకు గానూ వినూత్న ప్రయోగాలు కూడా చేస్తోంది. అలాంటి సంస్థ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్యాసింజర్ల కోసం ఇప్పటికే నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ, సీటర్ కమ్ స్లీపర్ బస్సు సేవలను అందిస్తోంది. పర్యాటకులను కూడా ఆకర్షించే ఉద్దేశంతో ఇటీవలే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సంగతి విదితమే. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేస్తూ దూరప్రాంత ప్రయాణికుల కోసం కొత్త బస్సులను తీసుకొస్తోంది.
సుదూర ప్రాంతాల ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తీసుకొస్తోంది. హైటెక్ హంగులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు దీటుగా వీటిని రూపొందించారు. వచ్చే నెలలో 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణలో అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తమవుతోంది. ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని ఈ బస్సుల్లో ఏర్పాటు చేశారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. వీటిలో మరిన్ని అత్యాధునిక హంగులను ఏర్పాటు చేశారు. అలాగే సేఫ్టీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్డీఎస్ఎస్)ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో నిఘా కోసం రెండు సీసీటీవీ కెమెరాలు ఉంచారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాను అమర్చారు. ఈ బస్సుల్లో ప్రయాణికుల కోసం వైఫై సదుపాయాన్ని కూడా కల్పించారు. కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి.. అలాగే కర్నాటకలోని బెంగళూరు, హుబ్లీ.. తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అనే పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్ ప్రాంగణంలోని కొత్త నమూనా ఏసీ స్లీపర్ బస్సుల్ని పరిశీలించారు. ప్రయాణికుల కోసం వాటిల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఈ బస్సులకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించేందుకు తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. pic.twitter.com/EWy4aDk2NJ
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2023