ఈ మద్య వరుసగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభావం వాహనదారులపైన మాత్రమే కాదు.. ప్రయాణీకులపై భారీగా పడుతుంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి షాకిచ్చింది. డీజిల్ సెస్ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇటీవలే వరుసగా ఆర్టీసీ చార్జీలు పెంచుతూ వచ్చింది ప్రభుత్వం. ఇంతలోనే ఇప్పుడు ఇంధన ధరలు పెరగడంతో టికెట్ రేట్లు పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ. 2 చొప్పున, ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులకు రూ. 5 పెంచుతున్నట్టు వెల్లడించింది. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధరను రూ. 10 గా నిర్ణయించింది. ప్రజలు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని.. కేవలం ఇంధన ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై భారం పడుతుందని.. ఈ నేపథ్యంలో తప్పని సరిగా చార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.