మహిళా ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. డైలీ ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఇక నుంచి ఆ సేవలను అందించనుంది.
మహిళల కోసం కర్ణాటక ప్రభుత్వం ఉచిత బస్సు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో పని మీద బయటకు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసే వారికి టికెట్ లేకుండా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా కర్ణాటక ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సరికొత్త నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ అడుగులు వేస్తోంది. ఒకవైపు తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకుంటూనే మరోవైపు ప్రయాణికులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చాలా ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ తాజాగా మహిళల కోసం మరో ఆఫర్ ను ప్రకటించింది.
హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో పని చేసే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జేఎన్టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా నడిచేలా లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. జేఎన్టీయూ, వేవ్ రాక్ మార్గంలో బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం పని వేళల్లో ప్రయాణించేలా ఎక్స్ క్లూజివ్ మెట్రో ఎక్స్ ప్రెస్ లేడీస్ స్పెషల్ బస్సుని ఏర్పాటు చేశారు.
ఫోరం/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్/రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్ రోడ్స్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్స్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మార్గాల్లో ఈ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. జూలై 31 నుంచి ఈ ప్రత్యేక సేవ ప్రారంభమవుతుందని అన్నారు. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ కి వెళ్లే బస్సు ఉదయం 9:05కి బయలుదేరగా.. సాయంత్రం 17:50 గంటలకు వేవ్ రాక్ నుంచి జేఎన్టీయూకి బయలుదేరుతుంది. కాబట్టి మహిళా ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుని వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఐటీ కారిడార్ లో లేడీస్ స్పెషల్ బస్సు!
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసo ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు ‘జేఎన్టీయూ-వేవ్ రాక్’ మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ప్రత్యేక… pic.twitter.com/m0BBcuVKQz
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023