తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. పండుగ సీజన్లో రాయితీలు కల్పిస్తూ.. ప్రయాణికులకు లబ్ది చేకూరేలా చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో రకాల స్కీమ్స్ అమలు చేస్తూ ఉన్నారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటమే కాదు.. గతంలో ఎన్నో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ప్రైవేట్ వాహనాల కన్నా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికులకు ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం హైదరాబాద్ బస్ భవన్ లో ‘టి9-30 టికెట్’ పోస్టర్ ని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే చాలు 30 కిలోమీటర్ల పరిధిలో రాను పోను ప్రయాణించే వెసులుబాటు ప్రయాణికులకు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 27, గురువారం నుంచి అమల్లోకి వస్తుందని.. పల్లె వెలుగు బస్సు కండెక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ టికెట్ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇస్తారని వెల్లడించారు.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ రాయితీ పథకం వర్తిస్తుంది.. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు ‘టి9-30 టికెట్’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 30 కిలోమీటర్లు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా ఈ టికెట్ వర్తిస్తుంది. ఈ టికెట్ రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుంది. ఈ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ కొంటే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. ఈ రాయితీ పథకం పై ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని #TSRTC ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30… pic.twitter.com/hA5W0ArowL
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 26, 2023