తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంప గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహాంలో తనను ఇరికించాలని చూస్తున్నారని.. తన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉందని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన దగ్గర ఏడీసీగా పని చేసిన తుషార్ పేరు, అనంతరం రాజ్ భవన్ పేరు కూడా చెప్పారని తమిళిసై గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి రాజ్ భవన్‌కు మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో.. బుధవారం నాటి ప్రెస్ మీట్‌లో.. తమిళిసై ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడంతో.. ప్రభుత్వం వర్సెస్ రాజ్ భవన్ వ్యవహారం మరింత ముదిరినట్లు అర్థం అవుతోంది.
ఫామ్ హౌస్ డీల్స్ కేసుల్లో తుషార్ వెల్లపల్లి ప్రస్తావన ఉంది. ఫోన్‌కాల్ రికార్డింగుల్లోనూ ఆయన పేరు పదే పదే వినిపించింది. ఇంతకు తుషార్ ఎవరంటే.. ఆయన కేరళకు చెందిన భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) నాయకుడిగా కొనసాగుతున్నారు. తుషార్‌కు బీజేపీ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం తుషార్ కేరళ ఎన్డీయే కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో తుషార్.. కేరళలోని వాయనాడ్ నుంచి ఎన్డీయే తరఫున రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన తర్వాత రాజ్‌భవన్‌లో ఏడీసీగా పని చేశారు. కొంత కాలం కిందట మానేశారు. ఇప్పుడు ఆయనను సాకుగా చూపి తమపై నిందలు వేయాలని చూస్తున్నారని గవర్నర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని కొందరు చెబుతున్నారని తమిళిసై ఆరోపించారు. రాజ్‌భవన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని.. చాలా మంది వచ్చి తనని నేరుగా కలుస్తున్నారని తెలిపారు. ఇక్కడికి వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదన్న గవర్నర్.. రాజ్ భవన్.. ప్రగతిభవన్‌లా కాదని.. రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చని… విజ్ఞప్తులు ఇవ్వొచ్చని ప్రజలకు సూచించారు తమిళిసై. కానీ ఓ గవర్నర్ ఏకంగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించడం సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.