జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచేవారే విజయం సాధిస్తారు. అలా సమాజంలో ఎదురయ్యే సమస్యలపై పోరాడుతూ చాలా మంది ఉన్నత స్థితికి చేరారు. ఇలా కష్టాల కడలి నుంచి పాలసముద్రం వైపు అడుగులు వేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చేరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి.
పేదరికంలో పుట్టి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాము పేదరికంలో పుట్టడం తప్పు కాదని పేదవాడిగా మరణిచడమే తప్పని భావించిన ఆ వ్యక్తులు సమస్యలకు ఎదురొడ్డి నిలబడి విజేతలుగా నిలిచారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి ఎన్నో అవరోధాలు వచ్చిన, మొండి ధైర్యంతో ముందుకు సాగి.. చరిత్రలో తమకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు. అంతేకాక వారి బాటలోనే ఎందరో యువత లక్ష్యం వైపు అడుగులు వేసి.. విజయం సాధించారు. తాజాగా అలాంటి వారి జాబితాలోకి చేరింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రసన్న లక్ష్మి. తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు.. తండ్రి చనిపోవడంతో ఆర్థికంగా ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి తరుణంలో కష్టాలను భరిస్తూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి.. ప్రసన్న యువతకు ఆదర్శంగా నిలించారు. మరి..ప్రసన్న లక్ష్మి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని కళాసీబస్తీకి చెందిన పిట్టల రాజేశ్వరావు, కళావతి భార్యాభర్తలు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే రాజేశ్వరావు.. పిల్లల చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించాడు. దీంతో కళావతి సింగరేణిలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరి.. కుమార్తెలిద్దరిని పెంచి పెద్ద చేసింది. తల్లి కష్టాన్ని గమనించిన పెద్ద కుమార్తె ప్రసన్న లక్ష్మి.. తాను మంచి ఉద్యోగం సాధిస్తే కుటుంబ సంతోషంగా ఉంటుందని భావిచింది.
తల్లి కష్టాలు చూస్తూ పెరిగిన ప్రసన్న ఎంతో కష్టపడి చదివారు. పదో తరగతిలో 9 జీపీఏ సాధించారు. అలానే ఇంటర్ లోనూ 921 మార్కులతో టాపర్లలో ఒకరిగా నిలిచారు. ఇంటర్ తరువాత బీటెక్ లో చేరి.. మెకానికల్ కోర్సు పూర్తి చేశారు. ఇదే సమయంలో ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్కేల్-1 అధికారి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఇదే మంచి అవకాశంగా భావించిన ప్రసన్న పట్టుదలతో పరీక్షలకు సన్నద్దమయ్యారు. కుటుంబ ఆర్థిక సమస్యలు తెలిసిన ప్రసన్న కోచింగ్ తీసుకోవడానికి వెనుకడుగు వేసింది. ఆత్మవిశ్వాసంతో సొంతంగా ప్రిపేరేషన్ మొదలు పెట్టారు.
యూట్యూబ్ వీడియోలు వీక్షించి ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించారు. అలానే ఆన్ లైన్ లో మోడల్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. ఈక్రమంలోనే తాను దరఖాస్తు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరీక్షలకు హాజరై ఉద్యోగాన్ని సాధించింది. ప్రసన్న లక్ష్మి ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. కుటుంబంలో ఎదురైన ఆర్థిక కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం సాధించిన ప్రసన్న లక్ష్మిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.