నేటి సమాజంలో రోజు రోజుకి మానవత విలువలు తగ్గిపోతున్నాయి. చాలామంది మృగాళ్ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పేగు బంధాన్నికి, రక్త బంధానికి ఉండే విలువలను మంటలో కలిపేస్తున్నారు. మరీ దారుణం ఏమిటంటే.. కొందరు తల్లిదండ్రులు నవమోసాలు మోసి.. కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో పడేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా తల్లిదండ్రుల ప్రేమకు మాయని మచ్చతెచ్చేలే కొందరు అప్పుడే పుట్టిన శివులను ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అటువంటి అమానుష ఘటన హైదరాబాద్ కుషాయిగూడ లో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపను అపార్ట్ మెంట్ పై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాపను చేరదీసి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతంలోని కమలనగర్ లో ఓ అపార్ట్మెంట్ కింద గాయాలతో అప్పుడే పుట్టిన ఓ పాప గుక్క పెట్టి ఏడ్చింది. అది గమనించిన స్థానికులు అక్కడి వెళ్లి చూడగా ఆ పసికందు తీవ్ర గాయాలతో పడింది. పై నుంచి కిందకి పడివేయడంతో ఆ శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉరుకుల పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతో ఉన్న పసికందును కాపాడే ప్రయత్నం చేశారు. పసికందును గాయలతో ఉన్న స్థితిలో చూసిన కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ చలించిపోయారు. పాపను తనచేతుల్లోకి తీసుకుని వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి పరుగు పెట్టారు.
మొదట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసిపాపకు చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాపను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి విషయంలో ఎస్సై సాయికుమార్ చేసిన పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు లేక ఎంతోమంది మనోవేదన చెందుతున్నారు. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది ఉన్నారు. బిడ్డల కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఒకవైపు.. బిడ్డలను భారంగా భావించి లేదా తాము చేసిన నీచమైన పనికి సాక్ష్యాలుగా పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తున్నాయి. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.