నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతోంది. ఒకవైపు హత్యలు, అత్యాచారాలు, యాక్సిడెంట్లు, దారి దోపిడీ వంటి ఘటనలు వణుకు పుట్టిస్తుంటే.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ కలకలం రేపుతోంది. నగరంలో ఏం జరుగుతోందా అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టిన చట్టాలు తీసుకొస్తున్నా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. క్రైమ్ మాత్రం ఆగట్లేదు. భాగ్యనగరంలో భారీ దోపిడీ జరిగింది. రాత్రి బార్ మూసేసి ఇంటికి వెళ్తున్న ఓనర్ పై దాడి చేసిన దొంగలు రూ.2 కోట్లు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఎంఆర్ఆర్ బార్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి బార్ మూసివేసిన ఆయన ఆరోజు వచ్చిన డబ్బుతో ఇంటికి బయలుదేరాడు. అయితే అతడి దగ్గర డబ్బు ఉందని గుర్తించిన దొంగలు వనస్థలిపురంలో అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిపై దాడి చేసి అతని దగ్గరున్న డబ్బును ఎత్తుకెళ్లారు. కాకుంటే.. ఈ పెనుగులాటలో బ్యాగు నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయారు. మిగతా డబ్బు బ్యాగును లాక్కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై ఆయన వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.