ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు ఆయా పథకాల పేరుతో కొంత డబ్బుని ఇస్తుంటాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వివిధ పథకాల ద్వారా డబ్బుని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో చేరిన లబ్దిదారులకు గొర్రెలు స్వయంగా కొనుగోలు చేసుకునేందుకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1.58 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
గతంలో గొర్రెలను ప్రభుత్వమే కొనుగోలు చేసి లబ్దిదారులకు పంపిణీ చేసేది. అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో భాగంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 4,699 లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1.58 లక్షల చొప్పున జమ చేయనున్నారు. 15 రోజుల్లో ఈ నగదుని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేశారు.
నగదు జమ చేయడమే కాకుండా.. గొర్రెలు కొనుగోలు చేసేలా చూడాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఇక మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తలసాని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క మత్స్యకారుడికి సభ్యత్వం ఇవ్వాలని, రాబోయే 3 నెలల్లో లక్ష 30 వేల మందికి సభ్యత్వాలు ఇవ్వాలని ఆదేశించారు. మరి గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1.58 లక్షల చొప్పున నేరుగా వారి అకౌంట్లలో జమ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.