కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కూలీలు.. చిరు వ్యాపారులు.. పేద ప్రజలు కష్టాలు పడ్డారు. అలాంటి వారికి అండగా ఉంటూ నటుడు సోనూసూద్ ఎంతోమందికి తనవంతు సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. రీల్ లైఫ్ లో విలన్ గా నటించి.. రియల్ లైఫ్ లో రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని కొనియాడారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సోనూసూద్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కోట్ల మంది అభిమానం సంపాదించిన వ్యక్తి కావడం కొంత మంది రాజకీయ నాయకులకు అస్సలు మింగుడు పడలేదని.. అందుకే ఆయన్ని టార్గెట్ చేశారని అన్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని విమర్శలు చేశారు. అతడి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు. వీటన్నింటికీ సోనూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
సోనూ రియల్ హీరో అని.. ఆయన వెంట తామంతా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమొక్కటే అన్నీ చేయలేదని మంత్రి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభమని.. బాధ్యతగా సేవ చేయడం గొప్ప అన్నారు. విపత్తు సమయాల్లో అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదని.. అలాంటప్పుడు స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సోనూసూద్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి. సోను సూద్ కి తాము ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు.